లోకేశ్ డేర్... జగన్ దే లేటు !!

February 23, 2020

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ప్రభుత్వం... విచారణ చేపడతామని, టీడీపీ భాగోతాన్ని బయటపెడతామని దాదాపుగా బెదిరిస్తున్నట్లుగానే ముందుకు సాగుతోంది. అయితే అమరావతిలో అసలు ఇన్ సైడర్ ట్రేడింగే జరగలేదని టీడీపీ కూడా ఆది నుంచే చెబుతూ వస్తోంది. ఇప్పుడు అమరావతిని చంపేసే దిశగా సాగుతున్న జగన్ సర్కారు... ఏపీకి మూడు రాజధానులంటూ కొత్త ప్రతిపాదనను తెర మీదకు తెచ్చిన నేపథ్యంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్... జగన్ సర్కారుకు దిమ్మ తిరిగే సవాల్ విసిరారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు తాము సిద్ధంగానే ఉన్నామని, విచారణకు ఆదేశాలు జారీ చేసే దమ్ము జగన్ కు ఉందా? అని లోకేశ్ సవాల్ విసిరారు. 

 

ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను లోకేశ్ ప్రస్తావించారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లను సంధించిన లోకేశ్... నిజంగానే జగన్ సర్కారుకు ముచ్చెమటలు పట్టించారని చెప్పక తప్పదు. సదరు ట్వీట్టలో లోకేశ్ ఏ తరహా అంశాలు ప్రస్తావించారన్న విషయానికి వస్తే... ఏడు నెలలుగా వైఎస్ జగన్ గారు తవ్వుతోంది అవినీతి కాదు వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చి పెట్టడానికి గొయ్యి. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్ గారు అవే పాత కాకిలెక్కలు చెబుతున్నారు. 4,075 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1,170 ఎకరాలు. మరి 4,075 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో భ్రమల్లో బతుకుతున్న వైకాపా నాయకులు, ఉప సంఘం మేథావులు చెప్పాలి. ఉప సంఘం నివేదికపై ఓపెన్ చాలెంజ్. అమరావతిలో జగన్ గారు ఆరోపిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వైరీకి మేము సిద్ధం. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వైరీకి జగన్ సిద్ధమా?’ అంటూ లోకేశ్ పెద్ద సవాల్ నే విసిరారు. 

 

జగన్ పై ఇంకా తన ఎదురుదాడిని కొనసాగించిన లోకేశ్... ‘మొన్నటివరకూ అమరావతిని భ్రమరావతి అన్న వైఎస్ జగన్ గారు నిజాలు ప్రపంచానికి తెలిసాక కొత్త పాట మొదలుపెట్టారు. చంద్రబాబు గారు ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లే. రాజధాని అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు కావాలి అంటూ కొత్త డ్రామా షురూ చేశారు. 28.06.19న ఏపీ సీఆర్డీఏపై వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ.9,165 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వం అమరావతి అభివృద్దికి ఖర్చు చేసింది అని చెప్పారు. అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిబ్రవరి 2019న టీడీపీ ప్రభుత్వం జీవో 50 విడుదల చేసింది. అందులో అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.55,343 కోట్లు. ఇందులో రాబోయే 8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది రూ.6629 కోట్లు. ప్రభుత్వానికి మిగిలే భూమితో మిగిలిన ఖర్చు అంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారానే వస్తుంది. అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు. విశాఖలో తన ల్యాండ్ మాఫియా అబివృద్ధి కోసం ఉన్న అమరావతిని చంపేసి కొత్త రాజధాని అంటున్నారు’’ అంటూ లోకేశ్ తనదైన శైలి విమర్శలు గుప్పించారు.