ఏపీలో అరెస్టుల వెనుక గుట్టు విప్పిన లోకేష్

August 10, 2020

ఏపీలో తెలుగుదేశం నేతలను వరుసగా అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. తొలి ఏడాది మొత్తం తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టడం, అరెస్టు చేయడం జరిగింది. 

ఇది భారీ ఎత్తున ఒక ఉద్యమంలో జరిగింది. కొన్ని హత్యలు కూడా జరిగాయి. అవి గవర్నమెంటు హత్యలు అని అప్పట్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. చాలా ఊళ్లలో బహిష్కరణలు జరిగాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇవి తారాస్థాయికి చేరాయి. 

చివరకు చలో ఆత్మకూరు కార్యక్రమం చంద్రబాబు నిర్వహించాక పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చాయి. కార్యకర్తల దాడులు కొంతవరకు తగ్గాయి.

అయితే, జగన్ పాలన మొదటి ఏడాది పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా నాయకులను అరెస్టు చేయనున్నట్లు పలువురు వైకాపా నేతలు కొంతకాలంగా హెచ్చరించారు. సీఐడీ అరెస్టులు చేస్తే అది ముందుగా వైకాపా నాయకులకు ఎలా తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. అంటే వైసీపీ ఎవరెవరిని అరెస్టు చేయాలో లిస్టు పంపిందా అని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. 

ఎవరూ ఊహించని విధంగా అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం, బలమైన లీడరు అయిన జేసీ కుటుంబంపై కేసులు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ సీరియస్ గా పరిగణించింది. ఆయా కుటుంబాలకు అండగా నిలిచింది.
 
ఒకవైపు ప్రభుత్వంలో కొందరు వైకాపా నేతలు అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు సీఎం ఊరికే ఉన్నారు. ముందు 108లో అవినీతి జరుగుతోంది, దానికి పాల్పడిన విజయసాయిరెడ్డిని అరెస్టు చేయండి అని తెలుగుదేశం నేత పట్టాభిరాం డిమాండ్ చేశారు. రెండ్రోజుల్లోపు ఆ స్కాంను గుర్తించి సాయిరెడ్డిని అరెస్టు చేస్తే జగన్ అవినీతిని అరికడుతున్నట్లు భావిస్తామని పట్టాభి పేర్కొన్నారు.

ఈ వ్యవహారాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. మీరు చేసే అవినీతిని  కప్పిపుచ్చుకునేందుకు, తెలుగుదేశం నేతలను అరెస్టు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. వైసీపీ నేతల ఇసుకలో, మద్యంలో, గనుల్లో చేస్తున్న అక్రమాలు చర్చకు రాకుండా ఉండడానికే ఈ అరెస్టులను తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు.

రివర్స్ టెండరింగులో డబ్బులు మిగిలిస్తానని చెప్పారు. ఇపుడేమో 108 కాంట్రాక్టును పాత కంపెనీకంటే వంద కోట్లు ఎక్కువ విలువకు మీ సొంత వాళ్లకు ఎలా ఇచ్చారు? దీనిపై మీరు విచారణ చేయరా? అని లోకేష్ నిలదీశారు.

రాజారెడ్డి రాజ్యాంగంలో స్కాంలు చేసిన వారికి కాకుండా స్కాంలు బయటపెట్టిన వారిని జైల్లో వేస్తారా? అని ప్రశ్నించారు.