జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం, పిడిగుద్దుల రాజ్యం

August 14, 2020

జగన్ ఏడాది పాలనపై లోకేష్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముఖంగా జగన్ పాలనలోని డొల్లతనాన్ని ఏకిపారేశారు. ఆయన ఒక్క ఛాన్స్ అని అడిగితే జనం పరిపాలన కోసం అనుకుని ఇచ్చారని, తీరా చూస్తే ఆ ఛాన్స్ ను విధ్వంసానికి వాడుకుంటున్నారని లోకేష్ నారా విమర్శించారు. 5 సంవత్సరాల టీడీపీ శ్రమను, ప్రజల కలలను ఏడాదిలోనే జగన్ చెరిపేశారని లోకేష్ ఆరోపించారు. 

ఏపీలో భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి చోటే లేదు. అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని నారా లోకేశ్‌ విమర్శించారు. జగన్ ఫేవరెట్ వర్డ్ అయిన `ఒక్క ఛాన్స్`‌ పేరుతో..వైసీపీ ఏడాది పాలనపై నారా లోకేష్‌ చార్జిషీట్ రిలీజ్ చేశారు. అదేంటి ఛార్జిషీట్ అనే పదం వాడారు అనుకుంటున్నారు... జగన్ సీబీఐ కేసుల్లో నిందితుడు కాబట్టి, నిందితుడిపై రాసే విషయాలను ఛార్జి షీట్ అంటారన్నది లోకేష్ లాజిక్.

వైసీపీ ఏడాది పాలనలో నవ మోసాలు, నవ కుంభకోణాలు తప్ప మరేమీ లేవని విమర్శించిన లోకేష్  ఏడాది జగన్ పాలనలో  ప్రజలు నానా కష్టాలు పడుతుంటే, జగన్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదిలోనే సొంత పార్టీ నేతలే పేరు పెట్టేంత ఘనంగా ఉంది జగన్ పాలన అని లోకేష్ వ్యంగాస్త్రం వేశారు. ప్రశ్నించిన వాడిని పడేసి గుద్దడమే జగన్ అనుచరులకు తెలిసిన విద్య అన్నారు.

లోకేష్ ప్రెస్ మీట్ హైలెట్స్

 

* ఏడాది కాలంలో 564 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  

* రైతు భరోసా పేరుతో రైతులను, పెన్షన్‌ పెంపు పేరుతో పేదలను మోసం చేశారు. 

* 3 వేల రూపాయల పెన్షన్ గురించి అడిగితే అరెస్టు చేసినా చేస్తారన్నారు.

* మద్యపాన నిషేధం చేస్తా అని ‘విషం’ వంటి చీప్‌ లిక్కర్‌ ను అమ్ముతున్నారు.

* మద్యం పేరుతో ప్రజలపై రూ. 25 వేల కోట్ల జే ట్యాక్స్‌ వేస్తున్నారు. 

* ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ నిధులను అమ్మ ఒడికి మళ్లించారు. 

* రాష్ట్రంలో ఇసుక రేట్లు ఆకాశంలో ఉంది

* జగన్ సర్కారు యూనిట్ కు‌ రూ.11 చొప్పున చెల్లించి పక్కరాష్ట్రాల నుంచి విద్యుత్ కొంటున్నారు. 

* కరోనా టెస్ట్‌ కిట్లలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది.  

* ఇళ్ల స్థలాల పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు.

* డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట వినలేదని చిత్తూరులో డా.అనితారాణిని నిర్బంధించారు.  

* జగన్‌ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది.  

* రంగుల పేరుతో రూ.2వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.