ఎవ‌ర‌బ్బా చెప్పింది... పార్టీలో లోకేష్ ఇష్టారాజ్య‌మ‌ని ?

July 21, 2019

ఇటీవ‌ల ప‌లుమార్లు ఓ వార్త షికారు చేసింది. పార్టీ ఇపుడు చంద్ర‌బాబు చేతిలో లేదు. అంతా లోకేష్ ఇష్టారాజ్యం అయిపోయింది. అందుకే పార్టీ బ‌ల‌హీన ప‌డుతోంది... అంటూ ఒక‌ట్రెండు ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఇచ్చారు. కానీ ఇది చంద్ర‌బాబును ఎదుర్కోలేక వైసీపీ వేసిన ప్లాన్ అనే విష‌యాన్ని విశ్లేష‌కులు చెబుతున్నారు. చంద్ర‌బాబును ఢీకొట్టి జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం అన్న‌ది క‌ల‌. జ‌నం కూడా చంద్ర‌బాబుతో జ‌గ‌న్ ని పోల్చుకోలేని ప‌రిస్థితి. స్టామినాలో గాని, నాలెడ్జ్‌లో గాని, ప‌ర‌ప‌తిలో గాని, అంత‌ర్జాతీయ ప‌రిచ‌యాల్లోగా, ప‌రిపాల‌న‌లో గాని ఎందులోనూ జ‌గ‌న్ - చంద్ర‌బాబుల‌కు పోలికే లేదు. అందుకే మ‌ళ్లీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అంటే జ‌నం జ‌గ‌న్ వైపు చూడ‌రు అని గ‌త రెండేళ్లుగా వైసీపీ ఓ కుట్ర చేసింది.
ఆ కుట్ర‌ను ఎలా మొద‌లెట్టారు అంటే... లోకేష్‌, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అని ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. 2019లో తెలుగుదేశం గెలిస్తే లోకేష్ ని చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిని చేస్తారు అని ప్ర‌చారం చేశారు. దీనివెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే... లోకేష్‌ని ఎలివేట్ చేస్తే జ‌నం లోకేష్ -జ‌గ‌న్‌ని పోల్చుకుని జ‌గ‌న్ వైపు మొగ్గుచూపుతారు అన్న‌ది దాని ఉద్దేశం. దీన్ని చాలా ప‌క‌డ్బందీగా ప్ర‌చారం చేశారు. ఖ‌ర్చుకూడా పెట్టారు. అయితే, వారికి చంద్ర‌బాబు తాజాగా పెద్ద షాక్ ఇచ్చారు.
మీకు ఒక విష‌యం గుర్తుందో లేదో... గ‌త ఏడాది క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో లోకేష్ ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాడు. అది పెద్ద దుమారం అయ్యింది. టీజీ వెంక‌టేష్ హ‌ర్ట్ అయ్యారు కూడా. ఎస్వీ మోహ‌న్ రెడ్డికి క‌ర్నూలు టిక్కెట్‌, బుట్టా రేణుక‌కు ఎంపీ టిక్కెట్ ఇస్తామ‌ని లోకేష్ ప్ర‌క‌టించాడు. అస‌లు లోకేష్‌ని ఎలివేట్ చేస్తూ ప్ర‌చారం చేస్తున్న వైసీపీకి ఈ మాటలు బాగా ప‌నికొచ్చాయి. అయితే... కాలం గ‌డిచింది. ఆ విష‌యం చాలామంది మ‌రిచిపోయారు. కానీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే... పార్టీ నిర్ణ‌యాల్లో చంద్ర‌బాబు లోకేష్ ని వేలు పెట్ట‌నివ్వ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. ఎందుకంటే... లోకేష్ ప్ర‌క‌టించిన ఆ ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌కు చంద్ర‌బాబు టిక్కెట్ ఇవ్వ‌లేదు. క‌ర్నూలు టిక్కెట్ భ‌ర‌త్‌కి, ఎంపీ టిక్కెట్ కోట్ల‌కి ఇచ్చారు. దీంతో వైసీపీ కుట్ర అంద‌రికీ అర్థ‌మైపోయింది. అందుకే ఇపుడు తేలుకుట్టిన దొంగ‌ల్లా ఉన్నారు.
చంద్ర‌బాబుకి 69 ఏళ్లు. కానీ 40 ఏళ్ల వారికి లేని ఓపిక‌, స‌హ‌నం, ఒంట్లో శ‌క్తి చంద్ర‌బాబుకు ఉన్నాయి. ఈ వ‌య‌సులో కూడా టీనేజ్ పిల్ల‌ల‌కంటే తిరుమ‌ల కొండ‌ను వేగంగా ఎక్క‌గ‌ల‌రు చంద్ర‌బాబు. ఇంకో ప‌దేళ్లు ఇంతే స్టామినాతో ప‌నిచేయ‌గ‌లిగిన జీవ‌న శైలిని ఫాలో అవుతారు. స‌రిగ్గా గ‌మ‌నిస్తే... ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లుపెట్టాక జ‌గ‌న్ కంటే ఎక్కువ స‌భ‌లు, కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు చంద్ర‌బాబు.