నారా లోకేష్ లో ఇంత మార్పా !!

August 13, 2020

మార్పు సహజం. అది ఎవరైనా సరే. ముఖ్యమంత్రి కాక ముందు వైఎస్ వేరు, అయ్యాక వేరు. ఒకపుడు జగన్ హావభావాలపై విపరీతమైన జోకులు పడేవి. ఇపుడు మార్పు వచ్చింది. హరీష్ రావు గతంలో ఎలా ఉండేవారు, ఇపుడు ఎలా ఉన్నారు... మనిషికి దేవుడిచ్చిన ఆయుధం ఆలోచన. అది మనిషిలో నిత్యం మార్పునకు కారణం అవుతోంది. లోకేష్ విషయంలోను ఇదే జరిగిందా? అంతేగా... సంక్షోభాలు వచ్చినపుడు వ్యవస్థలు, సమస్యల్లో ఉన్నపుడు మనుషులు వృద్ధి సాధిస్తారు.

బహుశా అధికారంలో ఉన్నంత వరకు తాను ఎలా ఉండాలి, ఏం మారాలి అని తెలుసుకోకపోయి ఉండొచ్చు. లేదా ఆ అవసరం రాకపోయి ఉండొచ్చు. కనీసం ఆ సలహా ఇచ్చే ధైర్యం కూడా ఎవరూ చేసుండకపోవచ్చు. కానీ పరిస్థితులన్నీ మారిపోయాయి. మారాల్సిన అవసరం వచ్చింది. మారితే వచ్చే ప్రయోజనం తెలిసింది. మారేందుకు అనువైన పరిస్థితులు కూడా దొరికాయి. అందుకే ఈరోజు కొత్త లోకేష్ కనిపించారు. మనం మునుపు చూడని లోకేష్ ను మనం చూశాం. 

బలహీనత, బలం ... ఈ రెండు గుర్తించిన వ్యక్తి కిందపడినా పైకి లేస్తాడు. గతంలో లోకేష్ ఏమో గాని ఇప్పటి లోకేష్ ఆ రెండు గుర్తించిన విషయం చాలా స్పష్టంగా కనిపించింది. ఓడిపోయాక తొలిసారి మీడియా ముందుకు వచ్చిన లోకేష్ లో ఆత్మవిశ్వాసం నిండుగా కనిపించింది. మాటలో చురుకుదనం, భావంలో స్పష్టత... చెప్పడంలో సూటిదనం... అన్నీ కలగలపి సన్నబడిన లోకేష్ లో మమేకమై కనిపించాయి. అంటే లోకేష్ కేవలం రూపం మాత్రమే మారలేదు. తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇతన్ని ఇంతకాలం ‘పప్పు’ అన్నారా... చక్కగా మాట్లాడుతున్నారే అని తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచేటంత సూటిగా, స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడారు లోకేష్. 

ఒకవైపు  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లైవ్ సమావేశంలో విపరీతమైన తప్పులు దొర్లుతున్నాయని రికార్డెడ్ వీడియోలు వదులుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఏకధాటిగా, సూటిగా, స్పష్టంగా చెప్పడమే కాకుండా తనకు ఎదురైన ప్రతి ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇస్తుంటే... తెలుగుదేశం శ్రేణులు ఉప్పొంగిపోయాయి. తెలుగుదేశం వారసుడిగా మారడానికి అసవరమైన విధంగా లోకేష్ రూపాంతరం చెందినట్టు తెలుగుదేశం శ్రేణులు సంతోషపడుతున్నాయి. అయితే... ఇది మొదటి దశ. ఇంకా ఎన్నో అవాంతరాలను, సమస్యలను, సంక్షోభాలను ఎలా ఎదుర్కొంటారు అన్నదాన్ని బట్టి లోకేష్ పై యాక్సెప్టెన్సీ రేటు ఉండబోతోంది. 

ఈరోజు కేవలం లోకేష్ లెక్కలు, సమాచారం చెప్పలేదు. పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. వైకాపా నాయకులను బెదరించారు. అధికారులకు బాధ్యత గుర్తుచేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో చూచాయగా చెప్పారు.

తాజా ప్రెస్ మీట్లో సందర్భానుసారం లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో కొన్ని మీ కోసం.

 

* జగన్‌రెడ్డి మతం విధ్వంసం, కులం కక్షపూరితం 

*  జగన్‌ వచ్చాక ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు... మాకొద్దు జగన్‌.. పోవాలి జగన్‌ అని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. 

* మడ అడవులను మడతబెట్టేశారు.. ఆవ భూములను ఆబగా లాగించేశారు. 

* ఏపీలో ఏడాదిలోనే 370 అత్యాచార ఘటనలు జరిగాయని, దిశ చట్టంలో ఇవన్నీ ఉన్నాయా?

* పాలన వరెస్ట్... చర్చ దేనిపై అయినా సరే...  టైం అండ్ ప్లేస్ చెప్పండి. వస్తాం !

* పాదయాత్రలో ముద్దులు... పీఠమెక్కాక  పిడిగుద్దులు 

* నేను ఒక్క ట్వీటు పెడితే వణుకుతున్నారు. కోవిడ్ అయ్యాక ఫీల్డులో దిగితే ఏమవుతారో  !

* అది అమ్మఒడి కాదు అర్ధ ఒడి - 83 లక్షలమందికి హామీ, 43 లక్షల మందికే డబ్బులు

* జగన్ పాలనలో షాక్ కొట్టాలంటే కరెంటు తీగ పట్టుకోనక్కర్లేదు... కరెంట్ బిల్లు పట్టుకుంటే చాలు

* మా కార్యకర్తలపై కాని మా నాయకులపై కాని దాడులు చేస్తాం, కేసులు పెడతాం అంటే... తిరుగుబాటు చేసి తరిమితరిమి కొడతాం

* నేను లావుగా ఉంటే హేళన చేశారు, నేను ఒక మాట అటూ ఇటూ అంటే హేళన చేశారు, ఈ రోజు అదే విధంగా ప్రజలను హేళన చేస్తున్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ ఇలాగే హేళన చేస్తున్నారు.

* ఇంగ్లిష్ మీడియంలో చదివి నా మాతృభాషలో నేను స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను... మన తెలుగు పిల్లలకు ఆ కష్టం వద్దు... తెలుగు, ఇంగ్లిష్ రెండు మీడియాలు పెట్టాలి, ఎంచుకోవడం వారికే వదిలేయాలి.