లోకేష్ ఆన్ ఫైర్... జగన్ మీ బాబు తరమే కాలేదు

July 03, 2020

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత ఇది కాస్తా ఎక్కువైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని, వాటన్నింటినీ బయటకు తీస్తామని చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇవే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్లకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. తాజాగా వైసీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా నారా లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. ఇందులో జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి పలు అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సైతం తీసుకువచ్చారు. ‘‘జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారూ!.. అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌!’’ అంటూ ట్వీట్ చేసి దానికి కొన్ని కాపీలను జత చేశారు. అందులో ఏఏ అంశంపై చార్జిషీట్లు వేశారు అనేది వివరించారు.

లోకేష్ చెప్పిన దాని ప్రకారం సభాసంఘంకు సంబంధించి 14, న్యాయ విచారణ 04, మంత్రివర్గ ఉప సంఘం 03, సీనియర్ ఐఏఎస్ అధికారి 04, సీబీసీఐడీ విచారణ పేరుతో మొత్తం 26 విచారణ కమిటీలు వేశారట. ఆయన ఈ ట్వీట్‌తోనే ఆగిపోలేదు. ఈ సారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరును తీసుకువచ్చారు. ‘‘మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎన్నో ఆరోపణలు చేస్తోంది. చివరి ట్వీట్‌లో దీనిపై స్పందించారు లోకేష్. ‘‘పోల‌వ‌రంపై టీడీపీ హ‌యాంలో పంపిన అంచ‌నాల‌న్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల... కలగానే మిగిలిపోతుంది’’ అంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.