లోకేశ్ సవాల్... వైసీపీ నేతలు నోరెత్తలేదు

February 22, 2020

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా... మూడు రాజధానుల మాటే వినిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందన్న భావనతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. దానికి ప్రస్తుతం సీఎంగా ఉన్న నాటి విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మద్దతు పలికారు. అయితే విపక్ష నేతగా ఉన్న సమయంలో తాను చేసిన ప్రకటనను మరిచిన జగన్... ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోగానే మాట మార్చేశారు. అమరావతిని చంపేసి... ఏపీకి మూడు రాజధానులంటూ కొత్త పాట అందుకున్నారు. జగన్ నోట నుంచి వచ్చిన ఈ మూడు రాజధానుల మాట రాష్ట్రంలో పెను కుంపటినే రాజేసిందని చెప్పాలి. తాను అనుకున్న ప్రాంతానికి రాజధానిని తరలించాలనుకున్న జగన్... ఆ నెపం మొత్తం టీడీపీదేనన్న రీతిలో వ్యవహారాన్ని నడుపుతున్నారు. అయితే ఈ తరహా జగన్ వైఖరిని తుత్తునీయలు చేస్తూ లోకేశ్ చేసిన ఓ సవాల్ ఇప్పుడు... వైసీపీ శ్రేణులకు పెను షాకే ఇచ్చిందని చెప్పాలి. 

ఈ దిశగా ట్విట్టర్ వేదికగా లోకేశ్ సంధించిన సవాల్ ఇప్పుడు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. సదరు ట్వీట్ లో లోకేశ్ ఏమేం ప్రస్తావించారన్న విషయానికి వస్తే... ‘‘అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీరు చేస్తున్న ఆరోపణలపై హైకోర్టు జడ్జితో విచారణకు తాము సిద్ధం. వైసీపీ అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన 40 వేల ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై హైకోర్టు జడ్జితో విచారణకు మీరు సిద్ధమా? సవాల్ స్వీకరిస్తే.. సాగరతీరంలో జగన్ ల్యాండ్ మాఫియా సినిమా బయటపడుతుంది. రాజధానిని మార్చడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. 7 నెలల పాలనలో ఎలాంటి ఆధారాలు చూపకుండా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ జగన్ పాత పాటే పాడుతున్నారు. అందుకే జగన్ కు సవాల్ విసురుతున్నా’’ అని లోకేశ్ కాస్తంత గట్టి సవాలే విసిరారు. మరి ఈ సవాల్ కు వైసీపీ శిబిరం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. అయితే లోకేశ్ ఇంత పక్కాగా సవాల్ విసిరిన నేపథ్యంలో వైసీపీ నుంచి అసలు సమాధానమే వచ్చే అవకాశమే లేదన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.