ఏడు ద‌శ‌లు.. ఆరు వారాలు.. సుదీర్ఘంగా ఎన్నిక‌లు

June 01, 2020

దేశ వ్యాప్తంగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల మీద స్ప‌ష్ట‌త‌నిస్తూ ఎన్నిక‌ల షెడ్యూల్ ను జారీ చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. గ‌తంలో మాదిరే సుదీర్ఘంగా ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. గ‌డిచిన ప‌దిహేనేళ్ల‌లో ఎప్పుడూ లేని రీతిలో తొలి ఫేజ్ లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి పూర్తి కానుంది.

పోలింగ్ ను తొలి విడ‌త‌లోనే పూర్తి చేసేలా షెడ్యూల్ ను సిద్ధం చేయ‌టంతో ఈసారి చాలా త్వ‌ర‌గానే ఎన్నిక‌ల వేడి చ‌ల్లారుతుంద‌ని చెప్పాలి. కాకుంటే.. కీల‌క‌మైన పోలింగ్ ముగిసిన త‌ర్వాత దాదాపుగా 40 రోజుల వ‌ర‌కూ  ఫ‌లితాల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది.

మొద‌టి విడ‌త‌లోనే పోలింగ్ పూర్తి కానున్న నేప‌థ్యంలో.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఉరుకులు ప‌రుగులు అన్న‌ట్లుగా జ‌ర‌గ‌నుంది. ఎంత వేగంగా ప్ర‌క్రియ మొద‌ల‌వుతుందో..అంతే వేగంగా పూర్తి కావ‌టం.. ఆ త‌ర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల ట్రెండ్ ను ప‌రిశీలిస్తూ.. తుది ఫ‌లితాల మీద విశ్లేష‌ణ‌లు చేసుకోవాల్సి ఉంటుంది.

తొలి విడ‌త‌కు రెండో ద‌శ‌కు ఏడు రోజులు.. రెండో విడ‌త‌కు మూడో ద‌శ‌కు ఐదు రోజులు.. మూడో విడ‌త‌కు నాలుగో ద‌శకు మ‌ధ్య ఏడు రోజుల గ్యాప్ ఉంది. చివ‌రి రెండు విడ‌త‌ల‌కు మ‌ధ్య వ్య‌వ‌ధి ప‌ద‌మూడు రోజులుగా ఉంది. ఐదో ద‌శ‌కు ఆరో ద‌శ‌కు మ‌ధ్య ఆరు రోజులు.. ఆరో ద‌శ‌కు.. ఏడో విడ‌త‌కు మ‌ధ్య ఏడు రోజులు వ్య‌వ‌ధి ఉంది. ఏడు ద‌శ‌ల‌కు మ‌ధ్య ఆరు వారాల వ్య‌వ‌ధి ఉండ‌టం కనిపిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు తెలుగు ప్రాంతంలో మ‌ధ్య‌లో పోలింగ్ జ‌రిగేది. అందుకు భిన్నంగా ఈసారి తొలిద‌శ‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌టంతో.. తుది ఫ‌లితం కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన ప‌రిస్థితి.