`50 ఏళ్ల వ‌య‌సులో...అంద‌మైన‌ వ‌రుడు ఎందుక‌మ్మా?`

August 07, 2020

`హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా!` త‌న తల్లికి రెండో వివాహం జరిపించిన ఆనందంలో ఓ కుమారుడు.. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ  కొద్దికాలం కింద‌ట‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టు నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. కేరళలోని కొల్లమ్‌కు చెందిన గోకుల్ శ్రీధర్ అనే ఇంజనీర్ ఈరోజు మా అమ్మ పెళ్లిరోజు అని మలయాళంలో పేర్కొంటూ తన తల్లి రెండో భర్తతో కలిసి ఉన్న ఫొటోను శ్రీధర్ షేర్ చేయ‌గా..అది వైర‌ల్ అయింది. స‌రిగ్గా అలాంటి రెండో వివాహ‌మే...మ‌రోమారు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంంటోంది. అయితే, ఇది రెండో వివాహం కాదు...వివాహ ప్ర‌క‌ట‌న‌! అయితే, ఇందులో ఆమె విధించిన ష‌ర‌తులు స‌హ‌జంగానే...చిత్రంగా ఉన్నాయి.
ముంబైకి చెందిన ఆస్తా శర్మ న్యాయ విద్యార్థిని. తాను పెళ్లి చేసుకుని వెళ్లిన తర్వాత తల్లి ఒంటరిగా ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆమెకు తగిన వ్యకిని వెతికేందుకు ఆస‌క్తిక‌ర రీతిలో ప్రయత్నం చేసింది. ఆస్తా శర్మ తన తల్లి కోసం చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. `మా అమ్మ కోసం అందమైన 50 ఏళ్ల‌ వరుడు కావాలి. శాఖాహారి అయి ఉండాలి. మద్యపానం అలవాటు ఉండకూడదు. జీవితంలో బాగా స్థిరపడి ఉండాలి’ అంటూ ఆస్తా శర్మ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో సంచలనం కలిగించింది.
ఆస్తా ప్ర‌క‌ట‌న‌తో ....నెటిజన్ల నుంచి సమాధానాల వెల్లువ మొదలైంది. అందులో ఎక్కువగా సానుకూల స్పందనలతోపాటు ఆమె ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ.. సిఫారసులు చేస్తూ.. ఆమె తీరును మెచ్చుకున్నారు. అమ్మ కోసం మంచి సంబంధం వెతికేందుకు వివాహ సంబంధాల వెబ్‌సైట్‌ను ఎందుకు సంప్రదించ కూడదు అంటూ కొందరు ఆస్తా శర్మను ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ.. ఆ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని చెప్పుకొచ్చింది.ఓ వయసు వచ్చిన వారి కోసం సరిజోడును వెతికేందుకు మూస ప్రకటనలకు భిన్నంగా అస్తా శ‌ర్మ‌ ప్రయత్నించడం అందరినీ ఆకర్షించింది. అయితే, అదే స‌మ‌యంలో ఆమె పెట్టిన ష‌ర‌తులు సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 50 ఏళ్ల వ‌య‌సులో...కావాల్సింది డ‌బ్బు కాదు...ధైర్యం. అందం కాదు అండ‌! అలాంటి ధైర్యం, అండ‌...ఉత్త‌మ వ్య‌క్తిత్వం ఉన్న‌వారితోనే సాధ్య‌మే కానీ...శాఖాహారి అయితేనో...మ‌ద్యం ముట్ట‌ని మేరున‌గ‌ధీరుడు అయితేనో కాదు క‌దా? అంటూ ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అన్నింటికీ మించి....స‌మాజంలో...ఇలాంటి రెండో వివాహాలు మ‌న చుట్టూనే..ఎన్నో జ‌రుగుతున్న‌ప్ప‌టికీ..ప‌ట్ట‌ని మ‌నుషులు...సోష‌ల్ మీడియాలో మెర‌వ‌గానే వైర‌ల్ అయింద‌ని చూడ‌గానే...వింత‌గా స్పందించ‌డం...నిజంగా వింతేన‌ని అంటున్నారు.