కరెంటు బిల్లుల మాటున దోపిడీ

August 07, 2020

పైసా పెంచబోమన్న జగన్‌
కానీ పాతపద్ధతి మార్చి వాత
జనానికి డైనమిక్‌ సిస్టమ్‌ షాక్‌
బిల్లు చూసి సామాన్యుడి కన్నీరు
లెక్కల గజిబిజితో తలబద్దలు

ఐదేళ్ల హయాంలో చంద్రబాబు ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. 2014లో ఆయన అధికారంలోకి వచ్చేనాటికి రోజుకు 14 గంటల కరెంటు కోత ఉండేది. కానీ 8 నెలలు తిరిగేసరికి మిగులు విద్యుత రాష్ట్రంగా మార్చారు.

నిరంతర విద్యుత సరఫరా చేసే స్థితికి చేర్చారు. కానీ కరెంటు చార్జీలు పెంచారని నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పదే పదే ఆరోపణలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల్ని పిండేస్తున్నారు.

విద్యుత బిల్లుల లెక్కింపు విధానాన్ని మార్చేసి పెద్దఎత్తున దోచుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బిల్లుల లెక్కింపునకు స్టాటిక్‌ విధానం అనుసరించగా... వైసీపీ ప్రభుత్వం డైనమిక్‌ విధానం తెచ్చింది.

స్టాటిక్‌ విధానం అంటే.. ఒక వినియోగదారుడి సంవత్సరం వాడకాన్ని సరాసరిగా తీసుకొని దానిని బట్టి శ్లాబులను నిర్ణయించేవారు.

ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఎనిమిది నెలలు తక్కువ వాడి నాలుగు నెలలు ఎక్కువ వాడినా సరాసరి తక్కువ ఉండడం వల్ల తక్కువ రేటు ఉన్న శ్లాబుల్లోనే ఉండేవాడు.

వేసవిలో 2-3 నెలలు అధికంగా వాడినా మిగిలిన నెలల్లో తక్కువ వినియోగం ఉంటే వేసవికి కూడా తక్కువ రేటు ఉన్న శ్లాబుల ప్రకారమే బిల్లు వచ్చేది. జగన్‌ తెచ్చిన డైనమిక్‌ బిల్లింగ్‌ విధానం ప్రకారం..

ఏ నెల వాడకాన్ని బట్టి ఆ నెల శ్లాబును నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక నెలలో వాడకం అధికంగా ఉంటే ఆ నెలలో ఎక్కువ రేటున్న శ్లాబుల్లోకి వెళ్ళిపోతారు. తక్కువ వాడకం ఉంటే తక్కువ శ్లాబుల్లోకి వస్తారు.

వినియోగదారుల మేలు కోసమే ఈ విధానం తెచ్చామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పచ్చి అబద్ధం చెప్పారు. వేసవి.. ఆపై కరోనా.. మార్చి బిల్లుల రీడింగ్‌ తీసుకోవడానికి సిబ్బంది రాలేదు.

దాంతో మే నెలలో మార్చి, ఏప్రిల్‌ నెలలకు కలిపి బిల్లు ఇచ్చారు. 3-4 రెట్లు పెరిగింది. జూన్‌లో ఇచ్చిన మే నెల బిల్లు కూడా వాచిపోయింది. దాంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

ప్రతిపక్షాలు భగ్గుమంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బిల్లులు పెరగలేదని.. రెండు నెలల బిల్లులు కలపడం వల్ల ఎక్కువగా కనిపిస్తోందని మొండివాదన చేస్తోంది.


లెక్కలతో చెలగాటం


గతంలో వేసవిలో కొంత ఎక్కువ వాడకం ఉన్నా సంవత్సరం సరాసరి వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఏ లేదా బీ గ్రూపుల్లో ఉండేవారు. ఇప్పుడు డైనమిక్‌ లెక్కింపు విధానం వల్ల ఎక్కువ మంది సీ గ్రూప్‌లో పడ్డారు.

దీంతో బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఈ గ్రూపుల మధ్య రేట్లలో చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏ గ్రూప్‌లో మొదటి 50 యూనిట్లకు ఒక యూనిట్‌ ధర రూ.1.45.

అదే బీ గ్రూప్‌లో మొదటి 50 యూనిట్ల వరకూ యూనిట్‌ ధర రూ.2.60. సీ గ్రూప్‌లో మొదటి 50 యూనిట్లకు యూనిట్‌ ధర రూ.2.65.. తర్వాతి 50 యూనిట్లకు యూనిట్‌ ధర రూ.3.35 పడుతుంది.

సీ గ్రూప్‌లో వాడకం పెరిగే కొద్దీ ధర ఇలా పైపైకి పోతూనే ఉంటుంది. వాడకం 400 యూనిట్లు దాటితే అక్కడ నుంచి యూనిట్‌ ధర రూ.8.50 పడుతుంది. 500 దాటితే యూనిట్‌ పది రూపాయలు పడుతుంది.

వినియోగం 600 యూనిట్లకు చేరిన వారికి చివరి రెండు వందల యూనిట్ల వల్లే రూ.1850 బిల్లు వస్తుంది. వేసవి కాలం... అందులోనూ లాక్‌డౌన్‌ సమయం కావడంతో కాస్త వాడకం పెరిగిన వారందరికీ డైనమిక్‌ లెక్కింపు విధానంలో వేలల్లో బిల్లులు వచ్చాయి.

ఈ రెండు నెలల బిల్లుల తయారీలో విద్యుత శాఖ అనుసరించిన విధానం... రూపొందించిన లెక్కలు చూసి ఏమీ అర్థం గాక వినియోగదారులు జుట్టు పీక్కొంటున్నారు.

ఒక వినియోగదారునికి మార్చి 10న మీటర్‌ రీడింగ్‌ తీస్తే మళ్లీ మే 10న రీడింగ్‌ తీశారు. అంటే మొత్తం అరవై రోజులకు కలిపి రీడింగ్‌ తీశారు. ఇందులో 21 రోజులు మార్చి నెల లెక్కలో వేశారు.

తొమ్మిది రోజులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ కింద వేశారు. మరో 30 రోజులు మరో బిల్లుగా చూపించారు. మార్చి నెలకు ఒక లెక్క... మిగిలిన రోజులకు ఒక లెక్క అనుసరించారు.

ఉదాహరణకు గుంటూరు నగరంలో ఒక వినియోగదారుడికి 60 రోజులకు రీడింగ్‌ తీశారు. ఇందులో 23 రోజులకు వాడకం 211 యూనిట్లుగా చూపించారు. దానికి రూ.875 బిల్లు వచ్చింది.

మిగిలిన 37 రోజులకు 342 యూనిట్ల వాడకం చూపించారు. దానికి రూ.1710 బిల్లు వచ్చింది. వాడకం 50 శాతం పెరిగితే బిల్లు మాత్రం వంద శాతం పెరిగింది. అలాగే కృష్ణా జిల్లా పోరంకి గ్రామ వాసికి రెండు నెలలకు రూ.880 బిల్లు వేశారు.

దీనిలో 23 రోజులకు పాత టారిఫ్‌ ప్రకారం, మరో వారం రోజులకు కొత్త  టారిఫ్‌ ప్రకారం కలిపి మొత్తం 174 యూనిట్లకు బిల్లు రూ.534.14గా పేర్కొన్నారు. మరో 30 రోజులకు కొత్త టారిఫ్‌ ప్రకారం మొత్తం 175 యూనిట్లకూ అన్ని ఇతరాలతో కలుపుకొని రూ.581.32గా పేర్కొన్నారు.

అంటే వాడకంలో ఒక్క యూనిట్టే పెరిగినా బిల్లు మాత్రం రూ.47.18 పెరిగింది. కేవలం 500 యూనిట్లపైన వాడుకున్న వారికి మాత్రమే యూనిట్‌కు రూపాయి పెంచామని అధికారులు చెబుతున్నా జనం నమ్మడం లేదు.

వినియోగదారుల అవగాహన కోసం గత రెండు సంవత్సరాల వాడకం వివరాలు నెట్‌లో పెట్టామని, ఎవరైనా చూసుకోవచ్చునని విద్యుత శాఖ అధికారులు ప్రకటించారు.

ఆ వివరాలు చూస్తున్న వినియోగదారుల్లో గందరగోళం ఇంకా పెరుగుతోంది. గుంటూరు వినియోగదారుడికి గత వేసవిలో తక్కువ యూనిట్ల వాడకానికి ఎక్కువ బిల్లు... ఎక్కువ యూనిట్ల వాడకానికి తక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇది టైపింగ్‌ పొరపాటా లేక మరేదైనా మతలబా అనేది అతడికి అర్థం కాలేదు. ఆదాయం కోసం ప్రజల నుంచి ఇలా దొంగచాటుగా ప్రభుత్వం బిల్లుల రూపంలో వసూలు చేస్తోది.

మానవీయంగా కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నామని.. అయినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం అంటున్నారు. దొంగచాటుగా దోపిడీ చేయడమే మానవత్వమేమో! అయినా ఇది ట్రైలరే. ఇంకా నాలుగేళ్లు ఉంది.

ఇంకెంత బిల్లు పెరుగుతుందో ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే.