పెన్నానది ఇసుక తవ్వకాల్లో బయటపడిన శివాలయం

August 10, 2020

పరమ శివుడి ఆలయం సాక్షాత్కరించింది. నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలో పెన్నానది ఇసుక మేటల్లో పూడుకుపోయిన 200 సంవత్సరాల నాటి శివాలయం తవ్వకాల్లో బయటపడింది. మండలపరిధిలోని పెరుమాళ్లపాడులో ఉన్న ఈ ఆలయం పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడలేదు. స్థానికుల యువకుల కృషి వల్ల వెలుగుచూసింది.

చాలా కాలంగా పురావస్తు శాఖకు, ప్రభుత్వానికి ఈ ఆలయం పూడిక తీసి బయటకు తేవాలని వినతులు చేసినా ఏ సర్కారు పట్టించుకోలేదు. అయితే మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వారంతా భారతదేశమంతటా తమ సొంత గ్రామాలకు తరలిపోయారు. 

1990ల తర్వాత నగరాలకు వలసపోయిన యువత తమ సొంతూర్లకు అపుడపుడు వచ్చినా అందరూ ఒకేసారి రావడం జరగదు. దీంతో ఊళ్లు కళ తప్పాయి. అయితే, దేశమంతటా కరోనా ప్రభావం వల్ల అన్నీ మూతపడటంతో జన్మభూమి అందరినీ పుట్టింటికి పిలిచింది. అలా పెరుమాళ్లపాడు యువకులు కూడా ఎక్కడెక్కడి నుంచో తమ సొంతూళ్లకు వచ్చారు. 

అందరిలో ఈ శివాలయం గురించి చర్చకు రావడంతో ప్రభుత్వం అవసరం లేదు. మనమే చందాలు వేసుకుని గుడి వెలికి తీద్దాం అని ప్రతినపూనారు. వారి కల ఫలించింది. తవ్వగా తవ్వగా... ఆలయం కనిపించింది. దీని ఖర్చంతా యువకులే భరించారు. మరి మళ్లీ దీనిని పునరుద్ధరించడానికి జగన్ సర్కారు ఏ మేరకు సాయం చేస్తుందో చూడాలి. 

మళ్లీ ఇసుక మేట వేయకూడదు అంటే చుట్టూ ఎత్తయిన ప్రహరీ నిర్మించాలి. ఇక ఈ ఆలయం పరశురాముడి ప్రతిష్టించిన ఆలయం. వేమన కుటుంబీకులు దీనిని నిర్మించారని ప్రతీతి. ఇక్కడ శివుడు నాగేశ్వర స్వామిగా సాక్షాత్కరిస్తారు.