‘లవర్స్‌ డే’ రివ్యూ

May 31, 2020

సినిమా: లవర్స్‌ డే

బ్యానర్: సుఖీభ‌వ సినిమాస్‌

న‌టీన‌టులు: ప్రియా వారియర్, రోష‌న్‌, నూరిన్ షెరిఫ్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ 

సంగీతం: షాన్ రెహ‌మాన్‌

క‌థ‌నం: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా

ఛాయాగ్ర‌హ‌ణం: శీను సిద్ధార్థ్‌

నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు

 

కన్నుగీటి కుర్రకారును బుట్టలో వేసుకుంది ప్రియావారియర్. రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. అయితే ఈమెకు ఇంత పేరు తెచ్చింది కేవలం `ఒరు ఆడార్ ల‌వ్‌` సినిమాలోని ఓ పాటలో   కన్ను గీటటమే. విడుదలకు ముందే మంచి పాపులారిటీ సంపాదించిన ఈ భామ.. తాజాగా వెండితెరపై ప్రత్యక్షమైంది. `ఒరు ఆడార్ ల‌వ్‌` సినిమాను తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా సంగతులేంటో చూద్దామా..

 

కథ:

రావూఫ్ రోషన్ (రోషన్) ప్రియాని (ప్రియా ప్రకాష్ వారియర్) మొదటి చూపులోనే ఇష్టపడతాడు. గాథా జాన్ తో పాటు వీరిద్దరూ డాన్ బాస్కో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో చ‌దువుతుంటారు. ప్రియ‌ను ఆట‌ప‌ట్టించాల‌ని రోష‌న్ ఆమెను టీజ్ చేస్తాడు. క్ర‌మంగా అది వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు దారి తీస్తుంది. ఆ తర్వాత వాళ్లిద్ద‌రూ ప్రేమించుకుంటున్న విష‌యం స్కూల్లో అంద‌రికీ తెలిసిపోతుంది. ఒకానొక స‌మ‌యంలో రోష‌న్ ఫ్రెండ్ చేసిన చిన్న త‌ప్పు వ‌ల్ల రోష‌న్ ప్రిన్సిపాల్ ముందు దోషిగా నిలుచోవ‌ల‌సి వ‌స్తుంది.  అయితే ఆ స‌మ‌యంలో ప్రియ అత‌నికి స‌పోర్ట్ చేయ‌దు. ముందు నుంచీ అత‌నికి స‌పోర్ట్ చేసే గాథ స‌పోర్ట్ చేస్తుంది. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనల అనంతరం అనుకోకుండా జరిగే ఓ తప్పు వల్ల రోషన్ – ప్రియాలు తమ ప్రేమకు బ్రేక్ అప్ చెప్పుకొని వీడిపోతారు. వారిద్దనీ మళ్ళీ కలపడానికి గాధ ఏమి చేసింది ? ఆ క్ర‌మంలో ఏమైంది? గాథ‌, రోష‌న్ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకున్నారా? లేదా? ప్రియ‌, రోష‌న్ మ‌ధ్య ప్రేమ ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 

సినిమా ఎలా ఉందంటే:

తెలుగు రాష్ట్రాల్లో కాలేజీగా చెప్పుకునే ప్ల‌స్ ఒన్‌, ప్ల‌స్ టూ అనేది త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్ అని లెక్క. కాబట్టి యూనిఫార్మ్ కూడా ఉంటుంది. అయితే అక్కడ ప్రియ‌, రోష‌న్ మ‌ధ్య స‌ర‌దాగా మొద‌లైన ప్రేమ ఎక్క‌డా డెప్త్ గా అనిపించలేదు.  ప్రియా కన్ను కొట్టినా, రోష‌న్ ఆమెకు ముద్దు పెట్టిన సీన్స్ యువతను ఆకట్టుకున్నాయి తప్ప లవ్ ఫీలింగ్స్ అంతగా కనిపించలేదు. కనీస లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రియా తన గ్లామర్ తో పర్వాలేదనిపించింది. మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ షెరిఫ్‌ తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పిస్తోంది. ముఖ్యంగా హీరోకు ఆమెకు మధ్య వచ్చే సీన్లతో పాటు వెరీ ఎమోషనల్ సాగే క్లైమాక్స్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా బాగా నటించింది. పాట‌లు బాగానే ఉన్న‌ట్టు అనిపించినా, టోట‌ల్‌గా సంగీతం సినిమాకు ప్ల‌స్ పాయింట్ కాలేక‌పోయింది. క్లైమాక్స్ మాత్రం ఆలోచింప‌జేసేలా ఉంది.

 

నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు:

ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ హీరో హీరోయిన్స్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గ్లామర్ పరంగా హీరోయిన్లు ఓ మోస్తారు మార్కులు కొట్టేశారు. ఇక దర్శకుడు తన విజన్ కి తగ్గట్లు సరిగ్గా సినిమాని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. శీను సిద్ధార్థ్‌ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది. షాన్ రెహ‌మాన్‌ అందించిన తొమ్మిది పాటల్లో రెండు పాటలు ఆకట్టుకున్నాయి.

 

బలాలు:

+ హీరోయిన్స్ గ్లామర్   

+ కొన్ని స‌న్నివేశాలు

+ క్లైమాక్స్

 

బలహీనతలు:

- కథ, కథనం

- రొటీన్ క‌థ‌నం

- డైలాగ్స్

మొత్తంగా : 'లవర్స్ డే' థ్రిల్ కోసం మిస్సయ్యింది 

 

రేటింగ్: 2.5/5