జన్మలో ఏపీలో పెట్టుబడి పెట్టం బాబోయ్.. దండం పెట్టేసిన అంతర్జాతీయ సంస్థ

July 08, 2020

జగన్ దెబ్బకు ఇప్పటికే వెనక్కు వెళ్లిన ప్రపంచబ్యాంకు, ఆసియా బ్యాంకు, సింగపూర్‌లకు మరో అంతర్జాతీయ దిగ్గజం కూడా తాజాగా తోడయింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసే క్రమంలో విశాఖలో రూ.2200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు లులూ గ్రూపుతో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు భూకేటాయింపులనూ రద్దు చేయడంతో ఆ గ్రూపు తీవ్రంగా స్పందించింది. జన్మలో ఇంకెప్పుడూ ఏపీలో పెట్టుబడి పెట్టమని ప్రకటించింది. ఈమేరకు ఆ సంస్థ భారత డైరెక్టర్ అనంతరామ్ జారీ చేసిన పత్రికా ప్రకటన అంటూ ఒకటి ప్రచారంలో ఉంది. దీనిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి జాతీయ మీడియా సంస్థలూ ఈ రోజు కథనాలు ప్రచురించాయి.
విభజన తరువాత ఏపీలో పెట్టుబడుల కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాల్లో భాగంగా గల్ఫ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సంస్థ లూలూ గ్రూపుతో ఒప్పందం చేసుకున్నారు. విశాఖలో భారీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్మించేందుకు 13.38 ఎకరాల భూమి కేటాయించారు. ఆ సంస్థ 2200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమై భూమి పూజ కూడా చేసింది.
తాజా పరిణామాలపై లూలూ గ్రూప్ విడుదల చేసిన ప్రకటనగా చెబుతున్న పత్రికా ప్రకటనలో.. ‘‘పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొని మేం విశాఖలో పెట్టబోయే పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి భూమిని లీజుపై పొందాం. భూకేటాయింపు తరువాత ప్రాజెక్టు ప్రాథమిక పనుల కోసం ఇప్పటికే అంతర్జాతీయంగా పేరున్న కన్సల్టెంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర అవసరాలకు చాలా ఖర్చు చేశాం. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అంగీకరిస్తూ వైదొలుగుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో ఇంకే కొత్త ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టరాదని నిర్ణయించుకున్నాం.
గల్ఫ్ కేంద్రంగా పనిచేసే మా గ్రూపు విశాఖలో రూ.2200 కోట్లతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించి విశాఖ నగరానికి షాపింగ్, కన్వెన్షన్ హబ్‌గా అంతర్జాతీయ గుర్తింపు తేవాలనుకున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 7 వేల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రణాళిక’’ అని అందులో చెప్పారు.
ఏపీలో ఇక పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదని... తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళల్లోని తమ అప్ కమింగ్ ప్రాజెక్టులు కొనసాగుతాయని చెప్పారు.
కాగా ఈ భూకేటాయింపును రద్దు చేసిన సమయంలో జగన్ ప్రభుత్వం... ఇది చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన అక్రమ కేటాయింపని ఆరోపించింది. మార్కెట్ వేల్యూ చాలా ఎక్కువగా ఉన్నప్పటికి ఎకరా రూ.4 లక్షల ధరకు 13.38 ఎకరాలను చవగ్గా కేటాయించారని.. పైగా గ్లోబల్ టెండర్లు పిలవలేదనీ చెప్పారు.
లూలూ గ్రూప్ గల్ఫ్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ దాని యజమాని యూసఫ్ అలీ భారతీయుడే. కేరళకు చెందిన ఆయన షాపింగ్, కన్వెన్షన్, రిటైల్ రంగంలో అంతర్జాతీయంగా పేరున్న వ్యాపారి. తాజా పరిణామంతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ గురించి నెగటివ్ మెసేజ్ వెళ్తుందని కార్పొరేట్ వర్గాల నుంచి వినిపిస్తోంది.