బైబై బాబు అన్నారు... ఇపుడు బైబై ఏపీ అంటున్నారు

July 09, 2020

ఏపీ తీవ్రమైన క్రైసిస్ ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు ఆయన తీసుకున్న చర్యల ఫలితంగా రాజధాని లేని రాష్ట్రం అనే బాధాకరమైన ఎమోషన్ ఉన్నా కష్టం లేకుండా ముందుకు నడిపించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏమీ లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం అయినా కూడా పెట్టుబడులను ఆకర్షించారు. పెట్టుబడి దారులు కూడా ఏపీలో తాత్కాలిక ఇబ్బందులున్నా... భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీలో అడుగుపెట్టాయి. కానీ ప్రభుత్వం మారాక దేశంలో గతంలో ఏ ప్రభుత్వమూ తీసుకోని తిరోగమన అనాలోచిత చర్యల మూలంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి. అవి కూడా చాలా పెద్ద పేరున్న అంతర్జాతీయ సంస్థలు. అలాంటి సంస్థలు వస్తే ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించడానికి అన్ని రాస్ట్రాలు రెడీగా ఉంటే.. ఏపీ ప్రభుత్వం వాటిని డిస్కరేజ్ చేస్తూ వెనక్కు పంపుతోంది.

తాజా ఉదాహరణ లులు గ్రూప్. గల్ఫ్ కేంద్రంగా పనిచేసే లులు గ్రూప్ కు విశాఖపట్నంలో కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతో ఆ కంపెనీ ఇక ఎప్పటికీ ఏపీలో అడుగుపెట్టం అని తెగేసి చెప్పింది. ప్రభుత్వ భూమి కేటాయించడంతో అంతర్జాతీయ నిపుణులతో నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్న స్థలాన్ని కేటాయించారని లులు పేర్కొంది. కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్, షాపింగ్ మాల్ కట్టి సుమారు 7 వేల ఉద్యోగాలు సృష్టిస్తామని ఆ కంపెనీ చెబుతోంది. కానీ ఏపీ మంత్రి మాత్రం అవన్నీ దాచిపెట్టి... కేవలం కన్వెన్షన్ సెంటర్ కోసం మాత్రమే వారు వచ్చినట్టు ప్రజలకు చెప్పి మిగతావి దాచిపెట్టారు. ఆ మాత్రం కన్వెన్షన్ సెంటర్ ప్రభుత్వం కట్టలేదా అంటున్నారు మంత్రిగారు. 

పథకాలకే సొమ్ములు భూములు అమ్ముకుందాం అని ఆలోచించే ఏపీ సర్కారు పెద్దలు... వీటిని కట్టడానికి డబ్బులు ఎక్కడ తెస్తారు. ప్రైవేటు కంపెనీలు ఇలా భయపడితే భవిష్యత్తులో పెట్టుబడులు పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఎలా వస్తాయి. ఏపీ ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి అవసరమా? పక్కనున్న తెలంగాణను చూసయినా ఎందుకు మన ఏపీ ముఖ్యమంత్రి గారు నేర్చుకోవడం లేదు. తన నిర్ణయాలతో ఏపీని ఎందుకు బలి చేస్తున్నారు. ఇవి సామాన్యుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. 

దీని గురించి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఆరోజు బైబై బాబు అంటూ అబద్ధాలతో పాటను అల్లి ఏపీ ప్రజలను మోసం చేశారు. అలా మోసపోయిన ఏపీ ప్రజలు ఈరోజు పరిశ్రమలు వెనక్కి వెళ్తుంటే దు:ఖిస్తున్నారు. బైబై బాబు అని వైసీసీ మోసం చేస్తే, బైబై ఏపీ అంటూ కంపెనీలు ఏపీకి అన్యాయం చేసే పరిస్థితి నేడు తలెత్తింది అంటూ లోకేష్ ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.