మీకిష్టం లేకపోతే నా పదవికి రాజీనామా చేస్తా...

May 26, 2020

మా అసోషియేషన్ సినీ నటుల సమస్యల పరిష్కారానికి ఎంత కృషిచేస్తుందో తెలియదు గాని... నిత్యం వివాదాలతో మీడియాలోకి ఎక్కుతుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి గాని మరీ రాజకీయ పార్టీల్లా మారి వివాదాస్పదంగా తయారవుతున్నారు. తాజాగా మరోసారి మా వ్యవహారం తెరమీదకు వచ్చింది.

ఓ సినిమా కార్యక్రమానికి హాజరయిన మా అధ్యక్షుడు నరేష్ మా గురించి మాట్లాడారు. తాను ఈ పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను గాని... ఎవరో బలవంతంగా తెరవెనక నన్ను పంపే ప్రయత్నం చేస్తే అది జరగదని.. నేను సభ్యుల ఓట్లతో గెలిచిన వ్యక్తి అని అన్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరని, అజాత శత్రువుని అన్నారు.

పెద్దల సహకారంతో ముందుకు వెళ్తున్నాను అంటూ చిరంజీవి, మురళీమోహన్, కృష్ణంరాజు పేర్లను ప్రస్తావించారు. తాను అధ్యక్షుడిని అయ్యాక ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు చెప్పారు. మాలో ఆధిపత్య పోరు ఉందని, ఇది రాజకీయ పార్టీ కాదు సేవా సంస్థ అని అందరూ గుర్తించాలన్నారు. నరేష్ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. ఇపుడు ఎన్నికలు కూడా లేవు. కానీ ఈ వివాదాన్ని ఇపుడు ఎందుకు తెరమీదకు తెచ్చారబ్బా అని చర్చించుకుంటున్నారు.