జగన్... ఇది బుద్ధిలేని నిర్ణయం: చంద్రబాబు

August 14, 2020

మడ అడవులు : ఇంత తెలివితక్కువ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు.

ప్రజలకు ఇళ్ల స్థలాలు ఎక్కడైనా ఇవ్వొచ్చు, కానీ దానికి మడ అడవులను నరికేసి స్థలాలు ఇవ్వడం అంటే అది వారికి ఆశ్రయం కల్పించినట్టు కాదు, భవిష్యత్తులో తుపానులకు వారిని బలివ్వడానికి పథక రచన చేసినట్టే అని చంద్రబాబు విమర్శించారు.

కోరంగి మడ అడవుల కారణంగా కాకినాడ తీర ప్రాంతం సునామీలు, తుపానుల నుంచి ప్రజలను జిల్లాను కాపాడుతోందని, అది ప్రకృతి మనిషికి ఇచ్చిన వరం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మడ అడవులు తొలగిస్తే ఈ ప్రాంతంలో నివసిస్తున్న 54,000 మంది మత్స్యకారులు, వారి కుటుంబాల జీవనోపాధి సర్వ నాశనం అవుతుందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. లక్షల మంది ప్రాణాలు గాల్లో దీపాలవుతాయని హెచ్చరించారు. 

పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వండి. కానీ దానికోసం తూర్పు గోదావరి జిల్లాలోని మడ అడవిని నాశనం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్థ కూడా ఈ మడ అడవులు ప్రాధాన్యాన్ని గుర్తించింది. దీని తొలగింపును నిరసించింది.

అక్కడ ఇళ్లు నిర్మిస్తే తుఫానుల నుంచి ప్రభుత్వం ప్రజలను కాపాడగలదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మడ అడవులను తొలగించే నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. 1996 సూపర్ సైక్లోన్ నుండి మడ అడవుల బలోపేతం చేస్తూ వస్తున్నాం. తీరప్రాంత కోతను నివారించడానికి మడ అడవులు చాలా అవసరం అని చంద్రబాబు చెప్పారు.