పదేళ్ల పిల్లాడు...బ్యాంకును దోచేశాడు !

August 13, 2020

ఇప్పుడు చెప్పేది రీల్ సీన్ ఎంతమాత్రం కాదు. రియల్ గా జరిగింది.

చాలా సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్ ఒకటి రియల్ గా జరిగిన వైనం సీసీ కెమేరాల్లో నమోదైన ఫుటేజ్ ను చూస్తే తప్పించి నమ్మలేని పరిస్థితి.

బ్యాంకు అధికారులకు.. పోలీసులకు ఒక పట్టాన అర్థం కాని రీతిలో తయారైన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

మధ్యప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రద్దీగా ఉన్న బ్యాంకులో పదేళ్ల బాలుడు.. కేవలం ముప్ఫై సెకన్లలో రూ.10 లక్షలు కొట్టేసిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎంతో నేర్పుగా కొట్టేసిన ఈ వ్యవహారంలోకి వెళితే.. నీముచ్ జిల్లాలోని జావాద్ అనే ప్రాంతంలో కో-ఆపరేటివ్ బ్యాంకు ఉంది.

ఉదయం పదకొండు గంటల వేళలో బ్యాంకు చాలా బిజీగా ఉంది. వచ్చి పోయేవారితో హడావుడిగా ఉంది.

ఇలాంటి సమయంలో పదేళ్ల బాలుడు ఒకరు పిల్లిలా క్యాషియర్ ఉండే క్యాబిన్ లోకి వెళ్లటం.. కేవలం ముప్ఫై సెకన్ల వ్యవధిలోనే కౌంటర్ లో ఉన్న నోట్ల కట్టల్ని కొట్టేసి బయటకు మాయం కావటం సీసీ కెమేరా ఫుటేజ్ లో కనిపించింది.

బ్యాంకులో చోరీ చేసిన ఈ పిల్లాడు బయటకు వచ్చి అనూహ్యంగా పరుగు తీయటంలో అనుమానం వచ్చిన సెక్యురిటీ సిబ్బంది అతడ్ని వెంబడించారు.

అప్పటికే మాయమైన ఆ పిల్లాడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

బ్యాంకులో చోరీ ఎలా జరిగిందన్న విషయాన్ని సీసీ కెమేరాలో నమోదైన పుటేజ్ ను చూసిన బ్యాంకు అధికారులు షాక్ తిన్నారు.

క్యాష్ కౌంటర్లోకి దూరిన ఆ పిల్లాడు.. కౌంటర్ బయట ఉన్న వారెవరికి కనిపించకుండా మేనేజ్ చేసిన తీరు చూస్తే.. పక్కా ప్లానింగ్ తోనే ఈ చోరీ చేసినట్లు చెబుతున్నారు.

ఈ ఉదంతానికి సంబంధం ఉందన్న అనుమానంతో నలుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

లోతుగా విచారణ చేస్తున్నారు. ముందుగా దొంగలు రెక్కీ నిర్వహించి.. తర్వాత బాలుడితో తమ ప్లాన్ ను అమలు చేసినట్లుగా గుర్తించారు.

ఈ ముదురు పిల్లాడి కోసం పోలీసులు తెగ శ్రమిస్తున్నా.. ఆచూకీ లభించని పరిస్థితి.