గురి తప్పలేదు.. బలపరీక్షకు కాస్త ముందుగా సీఎం కమల్ నాథ్ రాజీనామా

August 13, 2020

గురి పెడితే తప్పే ప్రసక్తే లేదు. టార్గెట్ చేశాక విడిచిపెట్టేది లేదు. కన్నేసిన తర్వాత సొంతం కాకుండా ఊరుకునేది లేదన్నట్లుగా మోడీషాల రాజకీయం ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కర్ణాటకలో కాస్తలో చేజారిన అధికారాన్ని.. పట్టుబట్టి.. ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసి చివరకు అధికారాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే.. మధ్యప్రదేశ్ లోనూ కమలనాథుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా మోడీషాలు చాలానే ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నం ఫలించే సమయం ఒకటి ఉన్నట్లుగానే.. మోడీషాలు కదిపిన పావులకు తగ్గట్లే.. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి కొద్ది గంటల ముందే కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత జోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయటం.. ఆయనకు విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతోనే కమల్ నాథ్ సర్కారుకు నూకలు చెల్లినట్లుగా తేలింది.
అయితే.. ఎమ్మెల్యే రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం కీలకం కావటం.. రాజీనామా చేసిన వారిలో ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాల్ని స్సీకర్ ప్రజాపతి ఇప్పటికే ఆమోదించటం.. మిగిలిన వారి రాజీనామాల్ని సైతం గురువారం ఆమోదించటంతో.. కమల్ నాథ్ సర్కారుకు కాలం చెల్లే పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి తగ్గట్లే అసెంబ్లీలో పార్టీల బలాబలాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా.. 228 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల్ని స్పీకర్ ఆమోదించిన నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 206కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా 104 మంది ఎమ్మెల్యేలు అవసరమైంది. అధికార కాంగ్రెస్ కు 114 మంది సభ్యుల బలం ఉంటే.. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటంతో ఆ పార్టీ బలం 92కు తగ్గిపోయింది. అదే సమయంలో.. బీజేపీకి 107 మంది ఎమ్మెల్యే బలం ఉంది. ఈ నేపథ్యంలో బలపరీక్షలో ఓటమి పాలయ్యే కన్నా.. అంతకు ముందే తన పదవికి రాజీనామా చేస్తే.. కాస్తైనా గౌరవం దక్కుతుందన్న భావనతోనే కమల్ నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పాలి.