వైసీపీలోకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. సంచలన కామెంట్స్

June 01, 2020

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరం అప్పుడే మొదలైంది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో జంపింగ్ జిలానీలు హంగామా చేస్తున్నారు. ఎప్పుడు ఏ వ్యక్తి ఏ పార్టీ నుంచి జంప్ అవుతారా.. అనేది ఉహించలేకపోతున్నారు జనం. అయితే ప్రకాశం జిల్లా రాజకీయాల విషయానికొస్తే.. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి హాట్ టాపిక్ అవుతున్నారు. మాగుంట మనసులో ఏముందనే సందేహం జిల్లాలో రాజకీయ నాయకులకు అంతుబట్టడం లేదు. టీడీపీలో ఆయన కొనసాగుతారని ఆ వర్గం అంటుండగా.. వైసీపీ బాట పట్టబోతున్నారంటూ వైసీపీ నేతలు డప్పు కొడుతున్నారు.

కాగా టీడీపీ తరపున ఆయనకు టికెట్ ఇచ్చేనందుకు పార్టీ సిద్ధంగా ఉంది. శ్రీనివాసులు రెడ్డి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఎంపీ అభ్యర్థిగా సైకిలు గుర్తుతో పోటీ చేసి వైకాపా అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో 15,568 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాగుంట కుటుంబం గత ఏడు ఎన్నికల నుంచి వరుసగా పోటీ చేస్తోంది. మాగుంట సుబ్బరామరెడ్డి, ఆయన తర్వాత భార్య పార్వతమ్మ, అనంతర కాలంలో శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ గెలుస్తూ వచ్చారు. 1999లో ఒకసారి ఓడిపోయినా 2004, 2009లలో వరుసగా గెలిచారు. మళ్లీ 2014లో ఓటమి చెందారు. మూడు దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న తాము పోటీకే దూరమైతే అపవాదు తప్పదని వారు భావిస్తున్నారట. 

ఈ మేరకు టీడీపీకి రాజనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తో ఉన్న అనుబంధం తోనే వైసీపీ లో చేరుతున్నానని అన్నారు. మాగుంట కుటుంబాన్ని ఆదరిస్తున్న జిల్లా వాసులకు ధన్యవాదాలు చెప్పారు. తనకు చంద్రబాబుతో 37 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పిన ఆయన చంద్రబాబు ఆహ్వానం మేరకే టీడీపీలో చేరానని, పార్టీ వైపు నుండి అన్ని రకాలుగా ఆయన సహకరించారని తెలిపారు. ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని అన్నారు. పార్టీలకు అతీతంగా జిల్లావాసులు మా కుటుంబాన్ని ఆదరించారని ఆయన చెప్పారు.