మాగుంట శ్రీనివాసుల రెడ్డి లక్ మామూలుగా లేదు

September 15, 2019

కేంద్రలోని బీజేపీతో సఖ్యత నెరుపుతున్న వైసీపీకి అందుకు ప్రతిఫలం దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఇప్పటికే దీనిపై వైసీపీకి ఆఫర్ వచ్చినట్లు నేషనల్ మీడియా కోడై కూసింది. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ నుంచి ఇంతవరకు బయటకు ఎలాంటి స్పందన కనిపించనప్పటికీ... ఆ పదవి ఎవరికి దక్కొచ్చన్న ఊహాగానాలు మాత్రం అక్కడ వినిపిస్తున్నాయి.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, వీరిలో అత్యధికులు తొలిసారి లోక్ సభకు ఎన్నికైనవారే. మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వల్లభనేని బాలశౌరి మినహా అంతా లోక్ సభకు కొత్తవారే. వంగా గీత గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసినప్పటికీ లోక్‌సభకు ఎన్నికవడం ఆమెకు కూడా ఇదే ప్రథమం.
గతంలో లోక్ సభ అనుభవం ఉన్న నలుగురిలో చూసుకుంటే మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎక్కువ సార్లు లోక్ సభకు గెలిచిన నేతగా కనిపిస్తున్నారు. ఆయనకు ఇది నాలుగోసారి. మంత్రి పదవుల కంటే స్పీకర్ పదవి భిన్నమైనది... సభా నిబంధనలపై అవగాహన, సభ ఎలా జరుగుతుంది.. ఎప్పుడేం చేస్తారు వంటిది అనుభవ పూర్వక జ్ఞానం ఉంటే తప్ప సభను నడిపించడం అంత సులభం కాదు.
మాగుంటకు లోక్‌సభ అనుభవం ఎక్కువ ఉండడంతో ఆయనైతేనే ఈ పదవికి అర్హుడని వినిపిస్తోంది. మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి జగన్‌కు సన్నిహితులైనప్పటికీ కూడా మిథున్ రెడ్డి ఇంట్లో ఇప్పటికే ఒక మంత్రి పదవి దక్కింది. అవినాశ్ రెడ్డి జగన్‌కు వరుసకు సోదరుడు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కుటుంబ సభ్యులకు పదవులు పంపకం చేపట్టారన్న ముద్ర రాకుండా చూసుకునేందుకు ఆయన పేరు కూడా పరిశీలించకపోవచ్చని సమాచారం.
ఈ అన్ని సమీకరణల నేపథ్యంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయి.. కాదంటే.. గతంలో పార్లమెంటు సభ్యురాలైన(రాజ్యసభ) వంగా గీతకైనా అవకాశం రావొచ్చని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే రెండు మంత్రి పదవులు ఇచ్చి.. అలాగే తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి ఇప్పుడు ఒంగోలు ఎంపీకి ఏకంగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనుకోవడంపైనా చర్చ జరుగుతోంది. మరి జగన్ ఎలా నిర్ణయిస్తారో వేచి చూడాలి.