టీడీపీ మహానాడు : బాబు అది మిస్ కాలేదు

August 10, 2020

తెలుగుదేశం శ్రేణులకు పండగ వంటి టీడీపీ మహానాడు ప్రారంభం అయ్యింది. మొట్ట మొదటిసారిగా ఆన్ లైన్లో ఒక పార్టీ ప్లీనరి జరపడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఆఫీసు నుంచి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఏర్పాట్లుచేశారు.

అంతకుముందు తెలుగుదేశం జెండా ఎగురవేసి, జ్యోతిని వెలిగించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. వెబినార్ (జూమ్ లో) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఊహించిన దానికంటే అధికంగా పార్టీ శ్రేణులు ఇందులో పాల్గొన్నారు.

టీడీపీ మహానాడు కార్యక్రమంలో ముందుగా ఎల్జీపాలిమర్స్ విషాద ఘటననే చంద్రబాబు ప్రస్తావించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని అభయమిచ్చారు. లాక్ డౌన్ వల్ల విశాఖను సందర్శించలేకపోయామని, తెలుగుదేశం బాధితులకు అండగా నిలిచినందుకు పార్టీ నేతలపై కేసులు పెట్టారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటని చంద్రబాబు నిలదీశారు. 

పాలకులకు గ్యాస్ లీక్ తీవ్రతపై ఏ మాత్రం శాస్త్రీయ అవగాహన లేదన్నారు చంద్రబాబు. పార్టీ తరఫున మృతుల కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మొత్తానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకున్నా కూడా చంద్రబాబు మహానాడు వేదికగా ఎల్జీపాలిమర్స్ నే ప్రధాన అంశంగా చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి చురకలు వేశారు.

అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి కంపెనీ సీజ్ గురించి మాట్లాడాల్సింది పోయి ఆ కంపెనీ తెరిచి ఉద్యోగాలిస్తామని నవ్వుల పాలయ్యారు. దీనివెనుక ఏదో కుట్ర ఉందని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి.