మహారాష్ట్ర ను షాక్ కు గురిచేసిన కాంగ్రెస్ హామీలు

May 29, 2020

దేశంలో...మెజార్టీ రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ...బీజేపీని గ‌ద్దె దించేందుకు అందివ‌చ్చే ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు. 288 అసెంబ్లీ స్థానాలు గ‌ల  కీల‌క‌మైన మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొంది. దీంతోపాటుగా ఢిల్లీ అభివృద్ధిలో భాగ‌మైన హ‌ర్యానా కోసం కీల‌క హామీలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, స్థానికులకు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించింది. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా, నిరుద్యోగులకు భృతి ఇస్తామని పేర్కొంది. ఈ భృతి ఏకంగా 10,000 అని చెప్ప‌డం గ‌మ‌నార్హం.
‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో విడుద‌ల చేసిన‌ మేనిఫెస్టోలో హర్యానా ప్రజలపై కాంగ్రెస్‌ వరాల జల్లు కురిపించింది. ప్ర‌ధానంగా యువ‌త‌పై ఈ మేనిఫెస్టో దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతోపాటుగా పీజీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.10,000, డిగ్రీ నిరుద్యోగ యువతకు నెలకు రూ.7,000 భృతిని అందజేస్తామని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలిపింది.వితంతువులు, వికలాంగులు లేదా వివాహం కాని మహిళలకు నెలకు రూ.5100 పింఛన్‌ను అందజేస్తామని ప్రకటించింది. గర్భిణీలకు మూడో నెల నుంచి ప్రసవం అయ్యే వరకు నెలకు రూ.3100, మహిళ పేరుపై ఇల్లు ఉంటే ఇంటి పన్ను సగానికి తగ్గింపు చేస్తామ‌ని వెల్ల‌డించారు. అలాగే పంచాయతీ రాజ్‌కు చెందిన సంస్థల్లో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సిటీ కౌన్సిళ్లలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. ఇక రైతుల‌కు సైతం హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొంది. రెండు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటించింది. 300 యూనిట్లలోపు కరెంట్‌ను వినియోగించే గృహాలకు కూడా ఉచిత విద్యుత్‌ను ఇస్తామని వెల్లడించింది.

హర్యానాలోని కోటీ 82 లక్షల మంది ఓటర్లు సీఎం మనోహర్లాల్ ఖట్టర్ ఐదేళ్ల పాలనపై అక్టోబర్ 21న తీర్పు ఇవ్వనున్నారు. అసోం మాదిరిగానే ఎన్ఆర్సీ ప్రక్రియను హర్యానాలోనూ చేపడతామని ఆయన ప్ర‌క‌టించారు. దీంతో ఈ ఎన్నికల్లో ప్ర‌ధాన రాజ‌కీయ అంశం కానుంద‌ని స‌మాచారం. ఇదిలాఉండ‌గా, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్ జోరుగా మొదలైంది. ఎన్ఆర్సీని సాకుగా చూపి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ బీజేపీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉంది.