ఉత్త‌రాది ఎన్నికల తీర్పు ఏం చెబుతోంది ?

June 01, 2020

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప్ర‌తిబింబించేది ఎన్నిక‌లే. ఈ ఎన్నిక‌లే ప్ర‌జ‌ల‌కు ప్ర‌జాస్వా మ్యం అందించిన పాశుప‌తాస్త్రం.త‌మ‌కు న‌మ్మ‌కం ఉన్న వ్య‌క్తుల‌ను పార్టీల‌ను ఎన్నుకోవ‌డం ద్వారా ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం కొత్త‌కాదు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న బారత్‌లోనూ పార్టీలు అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి. ఈ క్ర‌మంలో రెండు జాతీయ పార్టీలు కూడా దేశంలో ముందంజ‌లో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ క్ర‌మంలో దూసుకుపోతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ చేసుకున్న స్వ‌యంకృతం ఫ‌లితంగా దేశంలో ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయింది.
అయితే, మేమున్నామంటూ.. అదే స‌మ‌యంలో అరంగేట్రం చేసిన బీజేపీ పెద్దలు వ‌రుస‌గా రెండు సార్లు అదికారంలోకి వ‌చ్చి ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకున్నారు. ప్ర‌త్యామ్నాయం లేక పోవ‌డం ఒక కార‌ణ‌మైతే.. బీజేపీ విధానాలు క‌నీసం త‌మ‌కు బ‌తుకు తెరువు చూపిస్తాయ‌ని భావించిన ప్ర‌జ‌లు ఆ పార్టీని వ‌రుస‌గా అదికారంలోకి తెచ్చారు. అయితే, తాజాగా జ‌రిగిన మ‌హారాష్ట్ర‌, హ‌రియాణా ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీపై ఉన్న న‌మ్మ‌కం కూడా స‌న్న‌గిల్లింద‌నే అభిప్రాయం ఏర్ప‌డుతోంది. వాస్త‌వానికి గ‌త‌కొన్నేళ్లుగా దేశంలో ప్రాంతీయ పార్టీలు బ‌ల‌ప‌డుతున్నాయి అయితే, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ప్రాంతీయ పార్టీలు పుంజుకున్నా.. ఆశించిన మేర‌కు ఫ‌లితాల‌ను రాబ‌ట్ల‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం.
మ‌హారాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 103 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. గ‌తంలో క‌న్నా ఓట్లు, సీట్లు కూడా త‌గ్గిపోవ‌డం ప్ర‌జ‌లు ఈ పార్టీని ఎంత‌గా విశ్వ‌సిస్తున్నారో అర్ద‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో ప్ర‌త్యామ్నా యంగా ఉన్న కాంగ్రెస్‌ను ఏమైనా  గెలిపించారా? అంటే అది కూడా లేదు. మోడీ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు త‌మ‌ను గెలిపిస్తాయ‌ని ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ పుంజుకున్న‌ది కూడా లేదు. దీనిని బ‌ట్టి ప్ర‌జ‌లు మ‌హారాష్ట్ర‌లో ఏ పార్టీని కూడా విశ్వ‌సించ‌లేద‌ని తెలుస్తోంది. ఇక, ప్రాంతీయ పార్టీల విష‌యంలో కీల‌కంగా ఉన్న‌ది, రెండు జాతీయ పార్టీల‌కూ కొర‌క‌రాని కొయ్య‌గా ఉన్న‌ది శివ‌సేన‌., అయితే, ఈ పార్టీ ప‌ట్ల కూడా ప్ర‌జ‌లు పెద్ద‌గా విశ్వాసాన్ని చూపించ‌లేక పోయారు.
ఇక‌, హ‌రియాణా విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా ప్ర‌జ‌లు ఏ పార్టీనీ విశ్వ‌సించ‌లేదు. కాంగ్రెస్‌కానీ, బీజేపీ కానీ, స్థానిక పార్టీ జేజేపీ కానీ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చూర‌గొన‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయ‌నే చెప్పాలి. ఇక‌, ప్ర‌జాస్వామ్యంలో త‌ప్ప‌దు క‌నుక ఏదో ఒక పార్టీకి ఓటేయాలి క‌నుక వేసిన‌ట్టే అనిపించింది త‌ప్పితే.. ఇత‌మిత్థంగా ఈ పార్టీని న‌మ్ముదాం.. మ‌న జీవితాల‌ను బాగుచేస్తారు. అనే న‌మ్మ‌కం ఏపార్టీపైనా ప్ర‌జ‌లకు లేక పోవ‌డం తాజా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌నేది వాస్తవం. కాంగ్రెస్‌, బీజేపీలు ఇక్క‌డ 35 సీట్లతో ఊగిస‌లాడుతుంటే మ‌రో 20 పార్టీలు ఇత‌రులు గెలుచుకున్నారు. దీంతో ఇప్పుడు వాళ్లే కీల‌కం కానున్నారు. ఏదేమైనా నేల వీడి సాము చేస్తున్న పార్టీలు, ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు ప‌ట్ట‌ని నాయ‌కుల‌కు ఈ ఎన్నిక‌ల తీర్పు క‌నువిప్పు క‌లిగిస్తుందో లేదో చూడాలి.