బీజేపీకి సుప్రీం దెబ్బ... 24 గంటల్లో తేలిపోనుంది

June 01, 2020

మహారాష్ట్ర రాజకీయం దేశ రాజకీయాల్లో కొత్త వ్యూహాలకు వేదిక అవుతోంది. బీజేపీ సామ్రాజ్యాధిపత్యానికి బ్రేకులు పడతాయో లేదో ఇక్కడ త్వరలో తేలిపోతుంది. మహారాష్ర లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫడ్నవీస్ సర్కారుకు సుప్రీం అడ్డుకట్ట వేసింది. బలపరీక్ష వెంటనే తేల్చాలని సుప్రీం తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. 

ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ కు మెజార్టీ ఉండాలి కదా? ఎంత ఉంది? తగిన మెజారిటీ ఉంటే... 24 గంటల్లో నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. అది కూడా అసెంబ్లీలో నిరూపించుకోవాలని తేల్చేసింది. సుప్రీంనిర్ణయం బీజేపీకి గొంతులో వెలక్కాయలా తయారైంది.
బలపరీక్షకు బీజేపీ ఎక్కువ సమయం కోరినా లెక్క చేయలేదు. గవర్నర్ కు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు మధ్య జరిగిన లేఖల్ని కోర్టుకు సమర్పించారు. శివసేన, కాంగ్రెస్.. ఎన్సీపీ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అజిత్ పవార్ తరఫున మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పై ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ సీట్ల వివరాలు

 

మహారాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు- 288

బీజేపీ -  105 స్థానాలు

శివసేన - 56 స్థానాలు

ఎన్సీపీ - 54 స్థానాలు 

కాంగ్రెస్ - 44 స్థానాలు


ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఇప్పుడు బీజేపీకి 105 స్థానాలతో పాటు అజిత్ పవార్ చీల్చే ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు.. కొందరు ఇండిపెండెంట్లు ఉన్నారని చెబుతున్నారు అయినా మెజారిటీకి తగినంత మంది లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని ఆసక్తికర పరిణామాలకు అవకాశం ఉందని చెప్పక తప్పదు.