మోడీషాలకు దిమ్మ తిరిగే షాక్.. ఒక ఒరలో మూడు కత్తులు..

July 15, 2020

ఒక ఒరలో రెండు కత్తులు ఉండే ఛాన్స్ ఉందా? నో.. అంటే నో అనేస్తారు. రెండింటికే నో అన్నప్పుడు మూడు కత్తులకు అవకాశమే లేదంటారు. కానీ.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాటకు తగ్గట్లే తాజాగా మహారాష్ట్రలో రాజకీయం కొత్త రూపం దాల్చుకోనుంది. గడిచిన కొద్ది రోజులుగా కొత్త తరహా పొత్తు అంశంలో కిందామీదా పడుతున్న శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలు తాజాగా ఒక కొలిక్కి వచ్చాయి.
మొన్నటివరకూ వైరిపక్షాలుగా ఉన్న ఈ మూడుపార్టీలు ఇప్పుడు మిత్రపక్షాలుగా మారే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా మూడు పార్టీలకు చెందిన నేతలు కలిసి ఆయా పార్టీలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు సంబంధించినఒక  కామన్ మినిమం ప్రోగ్రాంపై 48 గంటల పాటు చర్చలు జరిపి నాలుగు పేజీల డ్రాఫ్టు రూపొందించారు.
వీటిని మూడు పార్టీలకు పంపారు. వీటిపై ఆయా పార్టీల్లో చర్చలు జరిపి ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు.  కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన రైతురుణమాఫీని.. పంట బీమా పథకంతో పాటు.. మిగిలిన పార్టీలు ఇచ్చిన హామీల్ని పరిగణలోకి తీసుకోనున్నారు. తాజాగా సిద్ధం చేసిన నివేదికల్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. శివసేన చీఫ్ ఉద్దవ్ లకు పంపారు. వారి నుంచి ఆమోదముద్ర పడిన తర్వాత ఉమ్మడి భేటీ జరుగుతుందని చెబుతున్నారు.
ఒకవేళ ఇప్పుడు రూపొందించిన నివేదికలో మార్పులు చేయాల్సి ఉంటే వాటిని చేస్తారు. అన్ని అనుకున్నట్లు సాగితే మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.  పార్టీ అధినేతల మధ్య సమావేశం జరిగిన తర్వాత.. గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఒకవేళ ఇదంతా జరిగితే మోడీషాలకు భారీ షాక్ తగలటం ఖాయం.