మహారాష్ట్ర రాజకీయం వెనుక ఉన్న ఒక స్త్రీ ఎవరు?

June 01, 2020

రష్మీ పుత్ర వాత్సల్యమే... ఠాక్రేల కొంప ముంచిందా? రష్మీ ఏంటీ... ఠాక్రేల కొపం ముంచిందేమిటని డౌట్ పడుతున్నారా? ఇందులో డౌటేమీ లేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జరిగిందిదేనట. రష్మీ అంటే... మన తెలుగు బుల్లి తెరపై కనిపించే రష్మీ గౌతమ్ కాదు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను మహారాష్ట్ర సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని రష్మీ పట్టుబట్టిన నేపథ్యంలోనే ఇప్పుడు సేన రాజకీయం తిరగబడిందట. ఎంత పుత్ర వాత్సల్యం ఉన్నా... పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలి గానీ... తెగే దాకా లాగితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్న విశ్లేషణలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ కథాకమమామీషు ఏమిటో చూద్దాం పదండి.

శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే.. మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆ పార్టీ సింగిల్ గా అధికారం చేపట్టకపోయినా... మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగలిగే పార్టీగా శివసేనను సీనియర్ ఠాక్రే నిర్మించారు. ఇక తన తర్వాత శివసేన చీఫ్ గా ఉద్ధవ్ ఠాక్రేను ఎదిగేలా చేసిన బాల్ ఠాక్రే ఆశించినట్లుగానే పార్టీ పగ్గాలు ఉద్ధవ్ కు దఖలు పడ్డాయి. మొన్నటిదాకా మహారాష్ట్రను పాలించిన బీజేపీ, శివసేన కూటమిలో సేనకు మంచి ప్రాధాన్యమే దక్కగా... సీఎం పదవి గానీ, డిప్యూటీ సీఎం పదవి గానీ దక్కలేదు. అయితే తాజా ఎన్నికలకు ముందు తన బలం మరింతగా పెరిగిందని భావించిన ఉద్ధవ్... కూటమి అధికారంలోకి వస్తే... సీఎం పీఠాన్ని సమంగా పంచుకుందామని ప్రతిపాదించారట. ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదనను బీజేపీ నేతలు అంతగా పట్టించుకోకున్నా... ఉద్ధవ్ మాత్రం ఆ ఫార్ములా ఆధారంగానే పని చేశారు.

ఉద్ధవ్ ఠాక్రే ఆ ఫార్ములాను అలా గట్టిగా పట్టుకోవడానికి గల కారణం ఆయన సతీమణి రష్మీ ఠాక్రేననట. ఎలాగూ ఉద్ధవ్ కు పదవులపై పెద్దగా ఆశ లేకున్నా... తన సతీమణి కోరిక మేరకు తన కుమారుడిని సీఎంగా చూసుకోవాలని మాత్రం గట్టిగానే నిర్ణయించుకున్నారట. ఇందుకు నిత్యం కుమారుడి రాజకీయ భవిష్యత్తును రష్మీ ప్రస్తావించడం కూడా ఓ కారణమట. భార్యాభర్తలు కలిసి ఈ కలను తీర్చుకునేందుకు ఆదిత్యను ఎన్నికలకు ముందే రంగంలోకి దించేశారు. పార్టీలో కీలక నేతగా ఎదిగేలా వ్యూహాలు అమలు చేశారు. అనుకున్నట్లుగానే ఆదిత్య కూడా సత్తా చాటి సీఎం పదవి చేపట్టే స్తోమత తనకుందని కూడా నిరూపించేసుకున్నారు. పార్టీకి మరిన్ని మంచి ఫలితాలు వచ్చేలా చేశారు.

అయితే బీజేపీని డిక్టేట్ చేసేలా సీట్లను మాత్రం శివసేన సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఉద్దవ్ ప్రతిపాదనను బీజేపీ కొట్టిపారేయగా... రష్మీ మాత్రం తన కుమారుడిని సీఎం చేయాల్సిందేనని తనదైన శైలిలో భర్తను ప్రోత్సహించడంతో పాటుగా... ఆ దిశగానే ఉద్ధవ్ సాగేలా చేశారట. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు శివసేనకు దక్కిన నేపథ్యంలో సీఎంగా ఉద్ధవ్ అయితే ఓకే గానీచ కుర్రోడౌన ఆదిత్యను సీఎంగా ఆ రెండు పార్టీలు ఒప్పుకోలేదట. అయినా కూడా రష్మీ తన పట్టుదలను మాత్రం వీడలేదట. ఈ క్రమంలో చర్చోపచర్చలు సాగుతుండగానే... బీజేపీ తనకు అనుకూలంగా వ్యూహాన్ని మలచుకుని ఎన్సీపీని చీల్చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తంగా కుమారుడిని సీఎంగా చూసుకోవాలన్న వాదనపై రష్మీ కాస్తంత తగ్గి ఉంటే... బీజేపీ సర్దుకునేలోగానే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టేదని, ఉద్దవ్ సీఎం అయ్యేవారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే... రష్మీ పట్టుదల కారణంగానే కూటమి సర్కారు ఏర్పాటు ఆలస్యం కాగా... బీజేపీ అవకాశాన్ని చేజిక్కించుకుందన్న మాట.