అజిత్...శ‌ర‌ద్ పవార్ మైండ్ ఎలా బ్లాక్ చేశారంటే..

January 21, 2020

ప్ర‌స్తుత హాట్ హాట్ రాజ‌కీయాల్లో ఒక్క‌సారి గెల‌వ‌డ‌మే గ్రేట్‌. అందులో రెండు సార్లు...మూడు సార్లు...హ్యాట్రిక్‌ను మించి డబుల్ హ్యాట్రిక్ సాధించ‌డం...అంతేకాకుండా ఏడో సారి కూడా గెలుపొంద‌డం...పైగా దేశంలోనే...మ‌రెవ్వ‌రికీ లేనంత మెజార్టీ సాధించ‌డం...నిజంగా విశేష‌మే. అలాంటి ప్ర‌త్యేక‌త‌లు కూడాగ‌ట్టుకుంది ఎవ‌రో తెలుసా? ప‌్ర‌స్తుతం మ‌హారాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి వార్త‌ల్లో నిలుస్తున్న‌ అజిత్ ప‌వార్‌. ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్‌లో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌హారాష్ట్రలోని పూణే జిల్లా బారామ‌తి నియోజ‌క‌వ‌ర్గ శాస‌నస‌భ్యుడిగా అజిత్ ప‌వార్ 1991 నుంచి వ‌రుస‌గా గెలుస్తూనే ఉన్నారు.! ఇటీవ‌ల జ‌రిగిన‌ మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలో దిగి బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీతో అజిత్ గెలుపొందారు. అజిత్ గెలుపుతో..తెలుగు నేల‌కు చెందిన ఓ యువ‌నేత రికార్డు చెరిగిపోయింది. ఆయ‌నే టీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీశ్‌రావు. అజిత్ తాజా గెలుపు నాటికి దేశంలో అత్య‌ధిక మెజార్టీ సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఖాతాలో ఉంది. ఇటీవ‌లి శాసనసభ ఎన్నికల్లో ఎవరూ సాధించని విధంగా 1,20,650 ఓట్లతో హరీశ్ భారీ విజ‌యం సొంతం చేసుకున్నారు. హరీశ్ తాజా ఎన్నికల్లో డబుల్ హ్యాట్రిక్ సాధించగా, ప్రతి ఎన్నికకూ మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. అదే రీతిలో అజిత్ ప‌వార్ సైతం ప్ర‌తి ఎన్నిక‌లోనూ గెలుపొంద‌డ‌మే కాకుండా....ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో రికార్డు స్థాయిలో 1,65,265 ఓట్ల‌ మెజార్టీతో స‌మీప ప్ర‌త్య‌ర్థిపై విజ‌యం సాధించారు. దీంతో...ఏడు సార్లు గెలుపొంద‌డం, పైగా 1,65,265 ఓట్ల‌ మెజార్టీతో అజిత్ తన ఖాతాలో ఓ ప్ర‌త్యేక రికార్డును న‌మోదు చేసుకున్నారు. ఇదిలాఉండ‌గా, శ‌ర‌ద్ ప‌వార్ కుటుంబంలో కీల‌క వ్య‌క్తి అయిన అజిత్ గ‌త సెప్టెంబ‌ర్‌లో తీసుకున్న‌ నిర్ణ‌యం రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించింది. మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శ‌ర‌ద్ ప‌వార్‌ పేరును చేర్చడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అజిత్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శ‌ర‌ద్ ప‌వార్‌కు ఫోన్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు పైగా మాట్లాడిన సోనియా ఆయనకు మద్దతు, సానుభూతి తెలిపారు. అజిత్‌ పవార్‌ రాజీనామా గురించి కూడా సోనియా ఆరా తీశారు. అంత‌టి ప‌ట్టును అజిత్ ప‌వార్ క‌లిగి ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే, తాజా ఉదంతంలో మ‌హారాష్ట్రలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీకి అజిత్ మ‌ద్ద‌త్తు ఇవ్వ‌డం ఆయ‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని శ‌ర‌ద్ ప‌వార్ అన్నారు. అజిత్ తీసుకున్న నిర్ణ‌యం ఎన్సీపీది కాదు అని శ‌ర‌ద్ ప‌వార్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. అజిత్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాము స‌మ‌ర్థించ‌లేద‌ని, మ‌ద్ద‌తు కూడా ఇవ్వ‌డంలేద‌ని ఎన్సీపీ చీఫ్ తెలిపారు.