ఒక్క పాటతో ఆల్బంను లేపాడు

July 04, 2020

‘మహర్షి’ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఐతే ఆ అంచనాలకు తగ్గ ఆడియో ఇవ్వడంలో దేవిశ్రీ ప్రసాద్ విఫలమవుతున్నాడంటూ అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకతుముందు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మూడు పాటల్లో ఏదీ అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే దేవి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు. దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ సంగీత చర్చలు జరిపాడు. అంత ముందుగా పని మొదలుపెట్టి, అంత బిల్డప్ ఇచ్చి చివరికి అతను చేసిన పాటలు చూసి జనాలు షాకయ్యారు. మూడు పాటల్లో ఏదీ కొత్తగా అనిపించలేదు. వాటిలో దేవి మెరుపులు కనిపించలేదు. ఇలాంటి తరుణంలో ‘పదరా పదరా’ అంటూ ఒక పాటను లాంచ్ చేయబోతుంటే.. ఇందులో మాత్రం ఏం స్పెషాలిటీ ఉంటుందిలో అనుకున్నారు.
కానీ నిన్న రిలీజైన ‘పదరా పదరా’ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు శంకర్ మహదేవన్ గానమే స్పెషల్ అసెట్ అయింది. ఇంకెవరు ఆ పాట పాడినా దానికి ఈ స్థాయి వచ్చేది కాదేమో. గొప్ప ఆర్ద్రతతో ఈ పాట పాడాడు శంకర్. ఒకప్పుడు తెలుగులో ఇబ్బడిముబ్బడిగా పాటలు పాడిన శంకర్.. గత కొన్నేళ్లలో ఇక్కడ పాటలు బాగా తగ్గించేశాడు. కానీ ఎప్పుడో ఒక పాట పాడినా.. అందులో ఆయన ముద్ర ఉంటోంది. ‘జ్యో అచ్యుతానంద’లో ‘ఒక లాలన’.. ‘ఖైదీ నంబర్ 150’లో ‘నీరు నీరు’ లాంటి పాటలు ఈ కోవలోనివే. ఇదే తరహాలో ఇప్పుడు ‘పదరా పదరా’ పాటతో అదరగొట్టేశాడు. శ్రీమణి ఎఫెక్టివ్ లిరిక్స్ కూడా పాట స్థాయిని పెంచాయి. మొత్తానికి ఈ పాటతో శంకర్ ‘మహర్షి’ ఆల్బంనే పైకి లేపాడని చెప్పొచ్చు. సినిమాలో ఇంకో రెండు పాటలు ఉన్నాయంటున్నారు. అవి కూడా ఈ స్థాయిలో ఉంటే ముందు పాటల తాలూకు నెగెటివిటీని దేవి అధిగమించినట్లే.