అమరావతికి అన్యాయం చేస్తున్న టాలీవుడ్

June 01, 2020
CTYPE html>
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా కొలువుదీరిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు గ‌త ఏడు నెల‌ల్లో ఎన్నెన్ని విన్యాసాలు చేసిందో తెలిసిందే. ముందు వెనుక చూడ‌కుండా గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్ని తిర‌గ‌దోడ‌డం.. ప‌ర్య‌వ‌స‌నాలు ఆలోచించ‌కుండా త‌మ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా ముందుకెళ్లిపోతుండ‌టం ప‌ట్ల జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా అమ‌రావ‌తి కొంప ముంచి విశాఖ‌ప‌ట్నానికి రాజ‌ధానిని త‌ర‌లించే దిశ‌గా కుట్ర‌పూరితంగా అడుగులు ప‌డుతున్నాయి. 
ఇది తిరోగ‌మ‌న నిర్ణ‌య‌మ‌ని జ‌గ‌న్‌ను అభిమానించే నేష‌న‌ల్ జ‌ర్న‌లిస్టు శేఖ‌ర్ గుప్తా సైతం తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. ఇంకా ప‌లువురు మేధావులు, రాజ‌కీయ నాయ‌కులు ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. అయినా జ‌గ‌న్ స‌ర్కారు మొండిప‌ట్టు వీడ‌టం లేదు. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌డాన్ని నిర‌సిస్తూ ఆందోళ‌న చేసేవాళ్ల‌ను తెలుగుదేశం మ‌ద్ద‌తుదారులుగా ముద్ర వేసి దీన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇలాంటి త‌రుణంలో ఈ పోరాటానికి ధైర్యంగా మ‌ద్ద‌తు ప‌లికే ప్ర‌ముఖులు కూడా క‌ర‌వ‌వుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల అభిమానంతో ఎదిగిన తెలుగు సినీ తార‌ల‌కు అస‌లు ఈ స‌మ‌స్య ఏమాత్రం ప‌ట్ట‌క‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం.
రాష్ట్రం విడిపోయాక ఏపీని సినీ జనాలు అసలు పట్టించుకున్నదే లేదు. విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని కేంద్ర ప్ర‌భుత్వం తుంగ‌లో తొక్కినా.. ఏపీకి తీవ్ర అన్యాయం జ‌రుగుతున్నా మ‌న సెల‌బ్రెటీలెవ్వ‌రూ స్పందించ‌లేదు. హోదాపై పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న స‌మ‌యంలో ఎవ‌రికీ నోరు పెగ‌ల్లేదు. మీడియా వాళ్లు అడిగినా స్పందించ‌లేదు.  అక్కడ తుపాన్లు వచ్చినపుడు కూడా టాలీవుడ్ స్పందన అంతంతమాత్రం.
కానీ త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న జ‌ల్లిక‌ట్టు పోరాటానికి మాత్రం మ‌న మ‌హేష్ బాబు మ‌ద్ద‌తు ప‌లుకుతూ ట్వీట్ వేశాడు. త‌ర్వాత అమేజాన్ అడ‌వులు కాలిపోతుంటే కూడా ఆందోళ‌న చెందాడు. మ‌న ద‌గ్గ‌ర యురేనియం త‌వ్వ‌కాల గురించి మాత్రం ఆయ‌న స్పందించ‌లేదు. క‌ర్ణాట‌క‌లో కావేరీ న‌దిని కాపాడేందుకు క్యాంపైన్ న‌డిపితే స‌మంత దాన్ని ఎండోర్స్ చేసింది. కానీ ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై మాత్రం మాట్లాడ‌దు. వీళ్లిద్ద‌రే కాదు.. మ‌న సెల‌బ్రెటీలంతా ఒక తాను ముక్క‌లే.
ప్ర‌స్తుతం అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపుతో కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లు తీవ్రంగా న‌ష్ట‌పోనున్నారు. టాలీవుడ్లో మెజారిటీ హీరోలు ఈ రెండు జిల్లాల నుంచి వ‌చ్చిన వాళ్లే. కానీ వాళ్లెవ్వ‌రికీ త‌మ ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయం ప‌ట్ట‌దు. ఇప్పటికీ సినీ పరిశ్రమకు అత్యధిక ఆదాయం ఇచ్చేది ఏపీ జనాలే. కానీ ఆ రాష్ట్రం పట్ల సినీ జనాలకు ఏం పట్టింపు ఉండదు. 
తమ ఆస్తులు, ఇతర ప్రయోజనాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్న నాయకుల్ని ప్రసన్నం చేసుకుని, వాళ్లను కాకా పడుతూ కూర్చుంటే చాలు. వాళ్ల‌కు తాము బాగుంటే చాలు. త‌మ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం. మిగతా వాళ్లు నష్టపోయినా పట్టించుకోరు. హీరోలకు రాష్ట్రం కంటే డబ్బు వ్యాపారాలు స్వప్రయోజనాలే ప్ర‌ధానం అని గ‌తంలో ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పుడు మ‌రోసారి త‌మ అస‌లు స్వ‌రూపం చూపిస్తున్నారు. ఇది ఏపీలో మెజారిటీ జ‌నాల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. 
ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు భారీగా ఆదాయం స‌మ‌కూర్చి పెట్టే కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లు ప్ర‌స్తుతం త‌మ‌కు క‌ష్టం వ‌స్తే ఇండ‌స్ట్రీ జ‌నాలు మౌనంగా ఉండ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఓవైపు ఆమ‌రావ‌తి అట్టుడుకుతుంటే సంక్రాంతికి రాబోతున్న స‌రిలేరు నీక్వెవ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల్ని ప్ర‌మోట్ చేసుకునే ప‌నిలో బిజీగా ఉన్న మ‌హేష్ బాబు, అల్లు అర్జున్‌ల ప‌ట్ల అక్క‌డ ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. వీరి సినిమాల్ని సంక్రాంతి స‌మ‌యంలో బాయ్ కాట్ చేయాల‌ని ఆ రెండు జిల్లాల జ‌నాలు చూస్తుండ‌టం గ‌మ‌నార్హం. యుఎస్‌లో కూడా అమ‌రావ‌తి పోరాటానికి మ‌ద్ద‌తుగా ఎన్నారైలు ఈ సినిమాల్ని ప‌క్క‌న పెట్టాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలా చేస్తే త‌ప్ప మ‌న సూప‌ర్ స్టార్ల‌లో క‌ద‌లిక రాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.