రాజకీయం, సినిమా... మహేష్ బాబు షాకింగ్ వ్యాఖ్యలు

August 14, 2020

మహేష్ బాబు చాలా తక్కువ మాట్లాడతారు. కానీ చాలా చలాకీగా మాట్లాడతారు. తక్కువ మాట్లాడటం అంటే... వేదికలపై తక్కువ కనిపిస్తుంటారని అర్థం. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమా సరిలేరు నీకెవ్వరు... హిట్ అయ్యింది. దానిని మరింత హిట్ చేసుకోవడానికి మహేష్ టీం బాగా టూర్లేసింది. మీడియాకు బాగా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఆయన చాలాకాలంగా రాజకీయం గురించి మాట్లాడటానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఎపుడు ఆ ప్రశ్న వేసినా... అయ్యో నాకు దాని గురించి తెలియదు అని, మా గౌతమ్ కి రాజకీయాల గురించి ఎంత తెలుసో... నాకూ అంతే తెలుసు అని చెబుతూ వచ్చారు. 

తాజాగా రాజకీయాల గురించి భిన్నంగా రియాక్టయ్యారు మహేష్ బాబు. అయితే ఈసారి పొలిటికల్ ఎంట్రీ గురించి కాకుండా... ఒక హైపోథిటికల్ ప్రశ్న అడగ్గా మహేష్ ఇలా స్పందించారు. మీరు ఒకరోజు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు? అని జర్నలిస్టు ప్రశ్నించగా... నేను సీఎం అయితే... రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి అంటూ తన రాజకీయ అయిష్టతను ముద్దుగా చెప్పారు మహేష్ బాబు. అంటే... నాకు పదవి ఇచ్చినా ఏం చేయాలో తెలియని వ్యక్తిని, ఊహలో కూడా నేను రాజకీయాల గురించి ఆలోచించను అని మహేష్ తేల్చేశాడు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్లు ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. పైగా చిరంజీవి చాలా అవమానాల పాలయ్యారు. పవన్ కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తను కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని మహేష్ బాగా దూరంగా ఉంటున్నాడు. ప్రైవేటు ఫంక్షన్లకు వచ్చినీ అందరితో అంటీ ముట్టనట్టు ఉండే మహేష్ నిత్యం జనాల్తో చేతులూపే రాజకీయాల్లోకి వెళ్లే అవకాశమే లేదు. ఇది ఖాయం. 

ఇక పోతే తాను ఆశగా, శ్వాసగా భావించే సినిమాల విషయంలో కూడా మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు ... అబ్బ వేస్టండీ.. బోరింగ్. నా బయోపిక్ వస్తే ఫ్లాపవుతుంది.... అనేశారు. తన గురించి తాను ఇలాంటి కామెంట్లు చేయడం ఆసక్తికరమే. అయితే.. అందులో శ్లేష ఉంది. తాను చాలా నిరాడంబరంగా ఉంటాను. సింపుల్ గా ఉంటాను కాబట్టి సినిమాకు పనికొచ్చే కథ కాదు అని చెప్పదలచుకున్నారు మహేష్ బాబు. 

మహేష్ బాబు దాచాలన్నా దాగనవి ఉంటాయిగా.. మహేష్ జీవితం బయోపిక్ కు పనికొచ్చేదే. ఒక గొప్ప తండ్రి కొడుకుగా, బాలనటుడిగా, ప్రేమికుడిగా, తల్లి, పిన్నమ్మ... లకు కొడుకుగా... బంధువులు రాజకీయాల్లో ఉండి, తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ... అబ్బో మహేష్ జీవితంలో చాలా సరుకు ఉంది. కానీ మహేష్ ఒప్పుకోవడం లేదు. ఏదేమైనా మహేష్ బాబు కామెంట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి.