బ‌న్నీపై మ‌హేష్ పైచేయి

May 31, 2020

ఏ సినిమాకు ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో ఏమో కానీ.. సంక్రాంతికి రాబోతున్న భారీ చిత్రాలు స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో ట్రైల‌ర్ల‌తో మాత్రం ఆక‌ట్టుకున్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే టార్గెటెడ్ ఆడియ‌న్స్‌కు న‌చ్చేలా ఈ ట్రైల‌ర్లు ఉండ‌టంతో సంక్రాంతికి ర‌స‌వ‌త్త‌ర స‌మ‌రం చూడ‌బోతున్నామ‌ని స్ప‌ష్ట‌మైంది. ఐతే కంటెంట్ ప‌రంగా దేని స‌త్తా ఏంట‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. రిలీజ్ ముంగిట నిర్వ‌హించిన ఈవెంట్ల విష‌యంలో మాత్రం స‌రిలేరు టీందే పైచేయి అయింది. ఇంత‌కుముందు పాట‌లు, ఇత‌ర ప్రోమోల విష‌యంలో బ‌న్నీ సినిమా.. మ‌హేష్ మూవీపై పైచేయి సాధించింది. కానీ ఆదివారం నాటి స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రి రిలీజ్ ఈవెంట్ ముందు.. సోమ‌వారం రాత్రి జ‌రిగిన అల వైకుంఠ‌పుర‌ములో మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ నిల‌వలేక‌పోయింది.

స‌రిలేరు ప్రి రిలీజ్ ఈవెంట్ రెగ్యుల‌ర్ స్ట‌యిల్లోనే జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఎల్బీ స్టేడియాన్ని ముంచెత్తిన జ‌న సంద్రం మ‌ధ్య చిరు ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌డం, ప‌క్క‌నే మ‌హేష్ ఉండ‌టం.. వీరికి తోడు విజ‌య‌శాంతి ఆక‌ర్ష‌ణ కూడా తోడై ఈ ఈవెంట్ క‌ళే వేరుగా క‌నిపించింది. దీనికి తోడు చిరంజీవి రొటీన్‌కు భిన్న‌మైన ప్ర‌సంగం.. విజ‌య‌శాంతితో కెమిస్ట్రీ, పరాచికాలు.. వివిధ అంశాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో ఈ ఈవెంట్ సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు మామూలు జ‌నాల్లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిన్న రాత్రి నుంచి మీడియాలో ఈ ఈవెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈవెంట్లో హైలైట్ల‌కు కొద‌వే లేక‌పోయింది. కానీ అల వైకుంఠ‌పుర‌ములో మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ దీనికి భిన్నంగా బోరింగ్‌గా సాగింది. సంగీత విభావ‌రి ప‌ట్ల స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో అంత ఆస‌క్తి లేక‌పోయింది. స‌రిలేరు ఈవెంట్‌కు చిరు వ‌చ్చిన‌ట్లు దీనికి గెస్ట్ రాక‌పోవ‌డం కూడా మైన‌స్ అయింది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ బాగానే మాట్లాడినా.. స‌రిలేరు ఈవెంట్ లాగా దీన్ని చ‌ర్చ‌నీయాంశం చేసే మెరుపులు లేక‌పోయాయి.