ఇపుడు కదా మహేష్ శ్రీమంతుడు అయ్యింది!!!

February 24, 2020

రీల్ లో పోషించే పాత్రలే కాదు.. రియల్ లోనూ అదే తీరుతో వ్యవహరించటానికి మించింది ఏముంటుంది? ఊరిని దత్తత తీసుకోవటం.. అవసరమైన వారికి సాయం చేయటానికి వెనుకా ముందు ఆడకపోవటం.. భారీగా ఆర్థిక సాయానికి మాట ఇవ్వటం లాంటివి రీల్ లైఫ్ లో హీరో పాత్రల్లో చూస్తుంటాం. రీల్ లోనే కాదు.. రియల్ గానూ తాను అలాంటి తీరే ఉంటుందన్న విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాయం చేసేందుకు సిద్ధమయ్యారు మహేశ్ బాబు.
అనుకోని రీతిలో ఈ విషయం బయటకు వచ్చింది కానీ.. ఆయనకు ఆయనగా ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉండాలనే భావించినట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన 13 నెలల చిన్నారి సందీప్ గుండె వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. అతడి గుండెలో మూడు రంధ్రాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జరీ తప్పనిసరి అని తేల్చారు.
అందుకు అవసరమైన ఆర్థిక స్తోమత సందీప్ తల్లిదండ్రులకు లేదు. అయితే.. ఈ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు జిల్లా మహేశ్ బాబు సేవా సమితి అధ్యక్షుడు తమ అభిమాన హీరోకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన మహేశ్ బాబు.. చిన్నారి గుండె ఆపరేషన్ కు అయ్యే ఖర్చును తాను భరిస్తానని మాట ఇచ్చారు. దీంతో.. ఈ శుభవార్తను మహేశ్ బాబు అభిమాన సంఘం సందీప్ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ నెల 14న విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్ లో ఆపరేషన్ చేయనున్నారు. రీల్ లోనే కాదు.. రియల్ లోనూ సాయం చేసే విషయంలో తాను శ్రీమంతుడినేనన్న విషయాన్ని మహేశ్ చేతల్లో చెప్పేశారని చెప్పాలి.