బన్నీని ఇరుకున పెట్టేసిన మహేష్

July 14, 2020

పబ్లిసిటీ విషయంలో సంక్రాంతి సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్ర బృందాలు ఎలా పోటాపోటీగా సాగుతున్నాయో తెలిసిందే. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఎప్పటికప్పుడు ప్రమోషన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలోకి వదులుతూ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల పరంగా అయితే.. ‘అల వైకుంఠపురములో’దే పైచేయి అన్నది స్పష్టం. దాని ఇతర ప్రోమోలు కూడా ‘సరిలేరు’తో పోలిస్తే కొంచెం భిన్నంగా కనిపించాయి. ఐతే మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ దృష్ట్యా కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ ‘సరిలేరు..’కు హైప్ ఏమీ తక్కువగా లేదు. తమ సినిమాకు హైప్ మరింత పెంచడం కోసం ‘సరిలేరు..’ టీమ్ ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిచి ‘అల..’ టీంకు షాకిచ్చింది. దీంతో ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ టీం తమ ఈవెంట్‌కు ఎవరిని చీఫ్ గెస్ట్‌గా పిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే ఆ సినిమాకే చిరంజీవి ముఖ్య అతిథిగా రావాలి. గతంలో బన్నీ సినిమాలు చాలా వాటికి ఆయన వచ్చాడు కూడా. ఇప్పుడు మహేష్‌ ఆయన్ని బుక్ చేసేశాడు. వీళ్లు కూడా చిరునే పిలిస్తే బాగోదు. అలాగని ఆయనకు దీటైన, లేదా ఆయన్ని మించిన మరో అతిథి దొరకడం అంటే కష్టం. కాదు కూడదంటే పవన్‌ కళ్యాణ్‌ను రప్పించాలి. కానీ పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయి సినిమాల వైపు చూడని పవన్.. ఈ వేడుకకు పిలిస్తే వస్తాడా అన్నది సందేహమే. తన ప్రియ మిత్రుడిని త్రివిక్రమ్ ఏమైనా ఒప్పించగలుగుతాడేమో చూడాలి. అలా కాదంటే ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న రాజమౌళినో.. అందులో హీరోలుగా నటిస్తున్న రామ్ చరణ్-ఎన్టీఆర్‌లనో రప్పించాలి. లేదంటే మాత్రం ‘సరిలేరు..’ వేడుకకు దీటుగా నిలవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో ‘అల..’ టీం ఏం చేస్తుందో చూడాలి.