మహేష్.. ఇంత కమర్షియల్ అయితే ఎలా?

May 30, 2020

టాలీవుడ్ హీరోల్లో మహేష్ అంత కమర్షియల్‌గా ఇంకెవరూ ఉండరని అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. ఆయన ఒక ట్వీట్ వేసినా.. ఒక వీడియో బైట్ వేసినా అందులో ఏదో ఒక ప్రయోజనం ముడిపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో ఎన్నో ఇష్యూలు వచ్చాయి. ఒక పెద్ద సెలబ్రెటీగా స్పందించాల్సిన సందర్భాల్లో మహేష్ మిన్నకుండిపోయాడు. తన సినిమా ‘స్పైడర్’ రిలీజ్ ముంగిట తమిళనాడులో జల్లికట్టు పోరాటానికి మద్దతిస్తూ మహేష్ ట్వీట్ వేయడంపై అప్పట్లో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. తనకు రాజకీయాలు అస్సలు తెలియవంటూ.. ఏపీకి ప్రత్యేక హోదా సహా అనేక అంశాలపై మహేష్ స్పందించకుండా ఉండిపోయాడు. కానీ తన సినిమా తమిళంలోనూ రిలీజవుబోతున్న సందర్భంలో మాత్రం జల్లికట్టు గురించి ట్వీట్ వేశాడు. ఈ ద్వంద్వ ప్రమాణాలపై నెటిజన్లు మహేష్‌ను నిలదీశారు.

ఇక మహేష్ ఎవరికైనా ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినా.. ఏదైనా సినిమాను పొగుడుతూ ట్వీట్ వేసినా.. అందులో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని.. అందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పరని, అన్ని సినిమాలూ పొగడరని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. శనివారం మహేష్ వేసిన ఒక ట్వీట్ ద్వారా ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు మహేష్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వేశాడు. కానీ ఇదే రోజు తమన్నా బర్త్ డే కూడా. ఆమె ఇంతకుముందు మహేష్ నటించిన ‘ఆగడు’లో కథానాయికగా నటించింది. పైగా ఇప్పుడు మహేష్  కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఐటెం సాంగ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అందులో మహేష్‌ను ట్యాగ్ చేశారు కూడా. కాబట్టి మహేష్‌కు తమన్నా పుట్టిన రోజు గురించి తెలియకుండా ఉండదు. కానీ ఆయన ఆమెను విష్ చేస్తూ ట్వీట్ వేయలేదు. కానీ ఏపీ సీఎంకు మాత్రం పనిగట్టుకుని విష్ చేశారు. దీంతో మరోసారి మహేష్‌లోని ‘కమర్షియల్’ కోణం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.