మహేష్ తగ్గాడు.. అఫీషియల్‌గా

May 29, 2020

సంక్రాంతికి రాబోయే భారీ చిత్రాలు ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకే రోజు రిలీజ్ కావని అధికారికంగా తేలిపోయింది. ముందు ఈ రెండు సినిమాల్ని పోటాపోటీగా జనవరి 12నే రిలీజ్ చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడం ఇరు వర్గాలకూ మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమైనా ఎవ్వరూ తగ్గలేదు. ఈ విషయంలో దాదాపు రెండు నెలల పాటు ప్రతిష్టంభన నెలకొంది. కానీ ఈ మధ్యే రాజీ కుదిరి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఒక రోజు ముందు, అంటే జనవరి 11న రిలీజ్ చేయడానికి అంగీకారం కుదిరింది. కానీ ఈ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించలేదు. ఐతే ఆదివారం చిత్ర నిర్మాణ సంస్థలు అఫీషియల్‌ రిలీజ్ డేట్ పోస్టర్లతో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేశాయి. జనవరి 11న రిలీజ్ అని వేసిన ‘సరిలేరు..’ పోస్టర్లను ఏకే ఎంటర్టైన్మెంట్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ట్విట్టర్లో పంచుకున్నాయి.
ఈ పోస్టర్ల మీద ‘సరిలేరు..’ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ల వివరాలు కూడా ప్రకటించడం విశేషం. విడుదలకు నెల ముందే తమ సినిమాకు బిజినెస్ కూడా పూర్తయిందని పరోక్షంగా సంకేతాలు ఇస్తోందన్నమాట చిత్ర బృందం. నైజాం ఏరియాలో దిల్ రాజు సంస్థ వెంకటేశ్వర ఫిలిమ్సే ‘సరిలేరు..’ను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. వైజాగ్‌లోనూ రాజే ఈ సినిమాను పంపిణీ చేస్తున్నాడు. సీడెడ్లో సాయిచంద్ర ఫిలిమ్స్.. తూర్పు గోదావరిలో వింటేజ్ క్రియేషన్స్.. పశ్చిమ గోదావరిలో ఆదిత్య ఫిలిమ్స్.. నెల్లూరులో హరి పిక్చర్స్.. కృష్ణాలో క్రేజీ సినిమాస్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇంతకుముందు ప్రచారం జరిగినట్లే గుంటూరు ఏరియాలో మహేష్ పీఆర్ వ్యవహారాలు చూస్తున్న దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను పంపిణీ చేస్తుండటం విశేషం. కర్ణాటకలోబృందా అసోసియేట్స్, చెన్నైలో ఎస్ఎస్సీ మూవీస్, నార్త్ ఇండియాలో పెన్ ఇండియా లిమిటెడ్, ఓవర్సీస్‌లో గ్రేట్ ఇండియా ఫిలిమ్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.