ఈ లేడీ ఎస్సై తెలివైన అందగత్తె

August 11, 2020

ఆమె ఒక మహిళ. చక్కటి వర్చస్సుతో పాటు తెలివితేటలున్న మహిళ. అందుకే ఆమె చురుకుదనానికి ప్రభుత్వం ఉద్యోగం వరించింది. ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. ఎస్సై శ్వేత జడేజా. ఇక్కడివరకు ఒక సక్సెస్ స్టోరీ. కానీ ఆమె తన తెలివిని వక్రంగా వాడటం మొదలుపెట్టింది. ఇదే విచారకరం అనుకుంటే... సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని బేరం పెట్టి సంపాదించుకోలనుకుంది. అడ్డంగా దొరికిపోయి అదే స్టేషన్లో ఖైదీగా మారింది.

అత్యాచారం కేసులో బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు.. తప్పుడు దారిలో వెళ్లింది. మహిళా పోలీస్ అయిఉండి కూడా.. సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా.. అవినీతికి పాల్పడింది. అత్యాచార నిందితుడితో డీల్ కుదుర్చుకొని.. కేసును మూసివేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అడ్డంగా బుక్కయింది. అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్నారనే అభియోగంపై ఓ మహిళా ఎస్‌ఐను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే ఇద్దరు మహిళలపై ఆ కంపెనీ యజమాని అత్యాచారం చేశారట. 2019లో జరిగిన ఈ ఘటనపై బాధితులు అహ్మదాబాద్ మహిళా పోలీస్ స్టేషనును ఆశ్రయించారు. కేసు నమోదైంది. దర్యాప్తు మొదలైంది. ఇంకా కేసు కొలిక్కి రాలేదు. బాధితుల్లో ఆవేదన పెరిగిపోయింది. వారి ఒత్తిడిని చూపించి నిందితుడికి ఎస్సై ఆఫర్ ఇచ్చింది. కేసులో ఇరికించేయమంటారా... 35 లక్షలు ఇస్తారా అని డిమాండ్ చేసింది. నిందితులు 20 లక్షలకు బేరమాడారు. అంగీకరించి తీసుకుని మళ్లీ కుట్రకు తెరలేపింది.

మిగతా 15 లక్షలు ఇస్తేనే వదిలేస్తా అంటూ మళ్లీ మొదలుపెట్టింది... దీంతో చిర్రెత్తిపోయిన నిందితులు ఆమెపై  సిటీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే...ఎస్సై కాస్తా అదే స్టేషనులో ఖైదీగా మారింది.