వైర‌ల్ బామ్మ‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ !

August 03, 2020

బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో విజ‌యం కంటే కూడా.. ఆ మ్యాచ్ కు హాజ‌రైన బామ్మ గురించి ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్న ప‌రిస్థితి. 87 ఏళ్ల‌ వ‌యసులో ఆట‌ను చూసేందుకు వీల్ ఛైర్లో వ‌చ్చిన చారుల‌త ప‌టేల్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. మ్యాచ్ కు వ‌చ్చింది మొద‌లు ఆమె వైపే కెమేరా తిర‌గ‌టం తెలిసిందే.
బుగ్గ‌కు త్రివ‌ర్ణ ప‌తాకం ముద్ర‌ను వేసుకొని.. చేతిలో బూర ప‌ట్టుకొని రోహిత్ శ‌ర్మ చెల‌రేగిపోయి షాట్లు కొట్టిన ప్ర‌తిసారీ చిన్న పిల్ల‌లా ఆమె ప‌రవ‌శించిపోయిన వైనం కోట్లాది మందిని ఆక‌ట్టుకుంది. ఈ శ‌తాబ్దానికి అస‌లుసిసలు క్రికెట్ క్రీడాభిమానిగా ఆమె మిగిలిపోతారేమో. ఆమె ఉత్సాహాన్ని.. ఆట మీద అభిమానాన్ని చూసి కోహ్లీ.. రోహిత్ శ‌ర్మ‌లు ఏకంగా ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆశీస్సులు తీసుకొని.. ఆమెతో మాట్లాడారు.
87 ఏళ్ల వ‌య‌సులో 8 గంట‌ల‌కు పైగా సాగిన మ్యాచ్ ను వీల్ చైర్లో కూర్చొని చూసిన ఆమె ఓపిక ఎంతోమందిలో ఉత్సాహాన్ని నింపింది. అలుపుసొలుపు లేకుండా టీమిండియాను ప్రోత్స‌హించిన చారుల‌త ప‌టేల్ కు తాజాగా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఆమె ఎవ‌రో తెలుసుకొని మ‌రీ త‌దుప‌రి జ‌ర‌గ‌బోయే టీమిండియా మ్యాచుల‌కు ఆమె టికెట్ల‌కు అయ్యే ఖ‌ర్చు మొత్తాన్ని తాను చెల్లిస్తాన‌ని త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా చారుల‌త క్రీడాభిమానానికి ఫ్యాన్స్ గా మారిపోతున్నారు.