మన జడ్జి శిక్ష వేస్తే... దేశమంతా చప్పట్లు కొట్టింది

August 07, 2020

సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది మ‌ల్కాజిగిరి కోర్టు. యావ‌ద్దేశం మొత్తం ఒక్క‌సారి మ‌ల్కాజిగిరి కోర్టు వంక చూసేలా ఇచ్చిన సంచ‌ల‌న తీర్పు ఎంతోమంది త‌ల్లిదండ్రుల‌కు ఊర‌ట‌నివ్వ‌ట‌మే కాదు.. క‌న్న‌వాళ్ల బాధ్య‌త‌ల్ని ప‌ట్టించుకోని పిల్ల‌ల‌కు షాకిచ్చేలా చేసింది.
క‌న్న‌త‌ల్లిని ఆద‌రించ‌క‌పోగా.. ఆమెను బెదిరించి.. మాన‌సికంగా.. శారీర‌కంగా హింసించిన కొడుకు.. కోడ‌లికి బుద్ది వ‌చ్చేలా సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది మ‌ల్కాజిగిరి కోర్టు. త‌ల్లిని చూడ‌కుండా ఆమె ఆస్తిని అక్ర‌మ‌ప‌ద్ద‌తిలో సొంతం చేసుకున్న కొడుక్కి.. అత‌డి దుర్మార్గానికి వ‌త్తాసు ప‌లికిన కోడ‌లికి రెండేళ్ల జైలుశిక్ష రూ.10వేల జ‌రిమానా విధిస్తూ సంచ‌ల‌న తీర్పును ప్ర‌క‌టించింది.
ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నేరేడ్ మెట్ లోని కాక‌తీయ‌న‌గ‌ర్ కు చెందిన ప్రేమ‌కుమారికి 66 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కొడుకులు.. ఒక కుమార్తె. అంద‌రికి పెళ్లిళ్లు అయ్యాయి. 2013లో ప్రేమ‌కుమారి భ‌ర్త మ‌ర‌ణించారు. ప్రైవేటు ఉద్యోగి అయిన పెద్ద కొడుకు అమిత్ కుమార్ త‌ల్లి ఇంటి మీద క‌న్నేశాడు. తాము వేసుకున్న ప్లాన్ లో భాగంగా 2015లో త‌న భార్య‌తో క‌లిసి త‌ల్లి ఇంట్లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించాడు. ఆ ఇంటిని త‌మ పేరుతో రెగ్యుల‌రైజ్ చేయించుకున్నాడు.
నాటి నుంచి త‌ల్లిని మాన‌సికంగా వేధించ‌టం షురూ చేశాడు. తీవ్ర‌స్థాయిలో తిట్ట‌టం.. ఇల్లు వ‌దిలిపెట్టి వెళ్లిపోవాల‌ని బెదిరించ‌టం షురూ చేశాడు. ఇంట్లోకి వ‌స్తే అంతు చూస్తాన‌ని చెప్పేవాడు. ఒక‌సారి బ‌య‌ట‌కు వెళ్లిన ప్రేమ‌కుమారి గ‌దికి తాళం వేసి.. ఇంట్లోకి రానివ్వ‌లేదు. దీంతో కొడుకు.. కోడ‌లు బెదిరింపుల‌పై నేరేడ్ మెట్ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు.
కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రిపి.. నిందితుల‌పై మ‌ల్కాజ్ గిరి కోర్టులో అభియోగ‌ప‌త్రాలు దాఖ‌లు చేశారు. కేసును విచారించిన న్యాయ‌స్థానం అమిత్.. లావ‌ణ్య‌ల‌ను దోషులుగా తేల్చ‌ట‌మే కాదు.. వారికి రెండేళ్ల జైలుశిక్ష.. రూ.10వేల జ‌రిమానా విధిస్తూ సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. క‌న్న‌వాళ్ల‌ను స‌రిగా చూడ‌ని ఎంద‌రో కొడుకుల‌కు.. వారి భార్య‌ల‌కు ఈ తీర్పు చెంప‌పెట్టుగా మార‌ట‌మే కాదు.. అడ్డాల నాటి బిడ్డ‌లు గ‌డ్డాల నాటికి ఎదురు తిరిగితే.. అలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు ఈ కోర్టు తీర్పు వారికి ద‌న్నుగా నిలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.