టీఆర్ఎస్‌లో ఆ ఇద్దరూ ఎందుకంత స్పెషల్..?

September 17, 2019

గులాబీ బాస్ గా కేసీఆర్ తీరును అంచనా కట్టటం అంత తేలిక కాదు. ఎవరైనా తన దారిలో నడవాల్సిందే కానీ.. ఆయన ఎవరి బాటలో నడవడం కనిపించదు. అంతేకాదు ఆయన మంత్రి వర్గంలో పదవులు ఇప్పించుకోవటం కూడా అంత తేలికైన విషయం కాదు. ఆయన మహా ఘటికుడు. ఎవ్వరి మాట వినడు. తాను అనుకున్నదే చేస్తుంటాడు. తాను కలవాలనుకుంటే కలవటం, తాను ఇవ్వాలనుకుంటే అపాయింట్ మెంట్ ఇవ్వటమే తప్పించి.. తనను కలవాలన్నా, తనతో భేటీ కావాలనుకున్నా తనకు వినతిపత్రాలు ఇవ్వాలనుకున్న వారికి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పాలి. సీఎంగా కానీ టీఆర్ ఎస్ అల్టిమేట్ బాస్ గా కానీ తానేం కోరుకున్నానో అది మాత్రమే జరగాలని బలంగా కోరుకునే తత్త్వం కేసీఆర్ సొంతం. అలాంటి మనిషినే ఓ ఇద్దరూ నేతలు ప్రభావితం చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు జనం.

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటారా? ఒకరు మంత్రి మల్లారెడ్డి కాగా.. మరొకరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ ఇద్దరి మూలాలు టీడీపీ కాగా తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచి టీఆర్ఎస్ లో చేరటమే కాదు, వారిప్పటివరకూ కోరుకున్న వాటిని కేసీఆర్ కాదనకుండా చేయించుకోవటం వారి ప్రత్యేకతగా చెప్పాలి. 2014లో ఎంపీగా టీడపీ తరఫున పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలని.. మంత్రి పదవిని చేపట్టాలని ఉంది. తన ముచ్చటను కేసీఆర్ కు చెప్పటమే కాదు ఆయన మనసు దోచేసి ఆయన కోరుకున్నట్లే ఎంపీగా కాలపరిమితి పూర్తి కాక ముందే ఎమ్మెల్యే టికెట్ ను తెచ్చుకోగలిగారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రి పదవిని కూడా సొంతం చేసుకోగలిగారు. తాజాగా తన అల్లుడుకి మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ టికెట్ ను తెచ్చుకోగలిగారు.

ఇక తలసాని విషయానికి వస్తే.. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీఆర్ఎస్ లోకి వస్తూనే నేరుగా మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఇంత మంది చేరారు కానీ.. ఎవరూ కూడా పార్టీలోకి వస్తూనే మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేసిన ఏకైక వ్యక్తిగా తలసానిని చెప్పుకోవాలి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవటం పెద్ద విషయం కాదు కానీ మంత్రి పదవిని నిలుపుకోవటం మాత్రం గొప్పే. ఇక ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తాజాగా తన కొడుకు సాయికిరణ్ కు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకోగలిగారు. మల్లారెడ్డి మాదిరే తలసాని కూడా తాము కోరుకున్నవన్నీ అధినేత చేత చేయించుకున్నారని చెప్పాలి. దీంతో కేసీఆర్ కి పార్టీలో ఈ ఇద్దరూ ఎందుకు ఇంత స్పెషల్ అయ్యారు? అని జనం చర్చించుకుంటున్నారు. ఎంతైనా కేసీఆర్ నే ప్రభావితం చేశారంటే మామూలోళ్ల వల్ల కాదు బాబు!