మోదీని మరీ కరివేపాకులా తీసిపారేసిన మమత

July 05, 2020

మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు. అంటే ఈ సామెత ఉద్దేశం.. ఎవ్వరైనా మైండ్‌లో ఒకటి బలంగా ఫిక్స్ అయితే వేరేవాళ్లని పట్టించుకోరని. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు చుక్కలు చూపించారు. అద్వానీ అంతటి నేతే మోదీ ధాటికి తట్టుకోలేక పక్కకు వెళ్లిపోయారు. ఇక చంద్రబాబు సంగతి సరేసరి. గత రెండేళ్లుగా ప్రత్యక్షంగా నరకం చూస్తున్నారు. ఎంతోమందిని ఇబ్బందిపెట్టిన మోదీకే ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది బెంగాల్‌ బెబ్బులి మమతా బెనర్జీ. మోదీని కరివేపాకు కంటే హీనంగా తీసిపారేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఫోని తుపాను ఒడిశా, బెంగాల్‌ను అతలాకుతలం చేసింది. రెండు రాష్ట్రాలు తుపాను వల్ల బాగా నష్టపోయాయి. దీంతో.. ఒడిశా పర్యటనకు వచ్చారు మోదీ. ఎయిర్‌పోర్టులో దిగిన దగ్గరనుంచి ఆయనకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, రాష్ట్ర అధికారులు సాదర స్వాగతం పలికారు. హెలికాప్టర్‌ ద్వారా తుపాను ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత మోదీ ఒడిశాకు రూ.1000 కోట్లు ప్రకటించి… మీరు హ్యాపీయే కదా అన్నట్లుగా బిహేవ్‌ చేశారు. ఆ తర్వాత బెంగాల్‌ వెళ్లి ఇలాంటి ఓదార్పు యాత్రే చెయ్యాలని అనుకున్నారు. కానీ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అంత మంచివారు కాదు, మెతక అంతకంటే కాదు. అందుకే.. మోదీ ఏం రావాల్సిన అవసరం లేదని పీఎంఓకు లేఖ రాశారు. మా అధికారులు ఎన్నికల్లో బిజీగా ఉన్నారు.. ఇప్పుడు రావాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చి పంపారు. దీంతో.. మోదీ షాక్‌ తిన్నంత పనైంది.

మోదీ బెంగాల్‌ వస్తే… ఆయన ప్రధాని కాబట్టి ప్రోటోకాల్‌ ప్రకారం.. ఆయన వెంట వెళ్లాలి. ఆయన అడుగులకు మడుగులు ఒత్తకపోయినా వెంటే తిరగాలి. ఎలా చూసినా కాస్త తగ్గాలి. అలా ఎందుకు తగ్గాలని అనుకున్న మమతా.. ప్రధాని రావాల్సిన అవసరం లేదంటూ కేంద్రానికి, అటు మోదీకి పెద్ద షాకే ఇచ్చారు. శారదా చిట్‌ఫండ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వ్యవహారంలో కేంద్రానికి బెంగాల్‌కు ఎంత గొడవ జరిగిందో అందరికి తెలుసు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో మమతా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మోదీ ప్రయత్నించారు. మొన్నటికి మొన్న 40 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోఉన్నారని కామెంట్లు చేశారు. వేరేవాళ్లు అయితే మర్చిపోయేవాళ్లు. కానీ అక్కడుంది కోల్‌కతా కాళీ. అందుకే మర్చిపోలేదు సరికదా.. సందర్భం రాగానే మోదీని అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చి శభాష్‌ అన్పించుకున్నారు. మమతానా మజాకానా.