Ongole: టిక్‌టాక్ మోజులో భార్య‌.... చంపేసిన భ‌ర్త‌

November 13, 2019

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు టిక్‌టాక్ మానియాలో యువ‌త ఊగిపోతున్నారు. టిక్‌టాక్ వీడియోలు చేసుకుని సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యేందుకు నానా పాట్లు ప‌డుతున్నారు. దీనివ‌ల్ల వ‌స్తోన్న పాపులార్టీ కంటే చాలా చోట్ల ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులే త‌లెత్తుతున్నాయి. తాజాగా టిక్‌టాక్ మోజులో ప‌డిన ఓ భార్య‌పై అనుమానంతో భ‌ర్త అతి కిరాత‌కంగా చంపేశాడు. ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.
ప్ర‌కాశం జిల్లా కనిగిరి మండలం, తాళ్లూరుకు చెందిన ఫాతిమా (30) కనిగిరిలో టైలర్ పనిచేసే పాశ్చా ఖాశీం (35)ను వివాహం చేసుకుంది. ఫాతిమాకు టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఇది క్ర‌మ‌క్ర‌మంగా ఓ వ్య‌స‌నంగా మారింది. ఈ వీడియోలు చేయ‌వ‌ద్ద‌ని పాశ్చా ఖాశీం భార్య ఫాతిమాను ప‌లుసార్లు హెచ్చ‌రించాడు. అయితే ఆమె మాత్రం టిక్‌టాక్ వీడియోలు చేయ‌డం మాన‌లేదు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు పెర‌గ‌డం... చివ‌ర‌కు ఫాతిమాకు వివాహేత‌ర సంబంధాలు ఉన్న‌ట్టు  ఖాశీం అనుమానించ‌డం జ‌రిగాయి.
ఓ యువ‌కుడితో ఆమె వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని కూడా టార్చ‌ర్ చేయ‌డం స్టార్ట్ చేశాడు. దీంతో పాటు ఫాతిమా కుటుంబాన్ని ప‌ట్టించుకోకుండా వీడియోలు చేస్తూ ప‌రువు తీస్తోంద‌ని భావించిన అత‌డు ఫాతిమాను చపాతీ కర్రతో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ నేపథ్యంలో ఫాతిమా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ముందుగా ఫాతిమా ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఏదేమైనా టిక్‌టాక్ మోజులో ఇప్ప‌టికే చాలా మంది ప్రాణాలు కోల్పోతుండ‌గా.. వీరి లిస్టులో ఫాతిమా కూడా చేరిపోయింది.