విమానంలో ఆ పని చేశాడు... గెంటేశారు

August 15, 2020

ఒంటికి యోగా మంచిదేగా అన్నది అందరి మాట. కానీ దానికి ఓ సమయం, సందర్భం, వేళాపాళా అనేది ఉండాలిగా. నా యోగా నా ఇష్టం అంటూ ఓ పెద్దాయన ఏకంగా విమానంలోనే ఆసనాలు వేయడం మొదలెట్టాడు. పక్కవాళ్ళకి కాళ్లు, చేతులు తగిలించాడు. శీర్షాసనం వేస్తూ ఒకరిపై పడబోయాడు. సాటి ప్రయాణీకులు ముందు వింతగా చూసారు. వారించారు. కాసేపయ్యాక చిర్రెత్తుకొచ్చింది వాళ్ళకి. మాకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది అని ఫిర్యాదు చేసారు. 

పరుగున పరుగున వొచ్చిన విమాన సిబ్బంది బాబ్బాబు మీ ఆసనాలు ఇక ఆపండి అంటూ బతిమిలాడారు. గురుడు వింటేగా.. ఇక చేసేదేం లేక సీఐఎస్ఎఫ్ కి సమాచారం అందించారు. అప్పటికింకా ఫ్లైట్ కదలకపోవడంతో ఆయన్ని కిందకి దించి ఆ విన్యాసాలేవో మా దగ్గర చెయ్ నీకు ఆకాశంలో చుక్కలు చూపిస్తాం  అనుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత అతడికి కాసేపు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చ్చారు. అతడిపై న్యూసెన్స్ కేసు పెట్టకుండా పోన్లే పాపం అని టికెట్ డబ్బులూ వాపస్ ఇచ్చింది ఆ ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థ.  

చెన్నై నుంచి కొలంబో వెళ్లే విమానంలో ఈ చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సదరు యోగా ప్రేమికుడు వారణాసి నుంచి వస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. చెన్నైలో కొన్ని ప్రదేశాలు సందర్శించి కొలంబోకి వెళ్లబోతున్నాడు. అతడి దగ్గర శ్రీలంక, అమెరికా కు చెందిన రెండు పాస్పోర్టులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు శ్రీలంక హై కమిషనర్ కి సమాచారం అందించారు.