అమెరికాలో తెలుగు ప్రభంజనం - 10 వేల మంది విద్యార్ధులతో మనబడి ! 

February 25, 2020

అందరికీ ఇంగ్లిష్ పైనే మోజు, తెలుగు అంతరించిపోతోంది అని ఎవరు చెప్పారు స్వామీ. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇంగ్లిష్ లో ఎవరూ స్పందించడం లేదు. తెలుగులోనే స్పందిస్తున్నారు. ఉన్నది అమెరికా అయినా, ఆంధ్రా అయినా, తెలంగాణ అయినా... తెలుగు వారి మోజు తెలుగు భాషపైనే ఉంది. దానికి ఓ బ్రహ్మాండమైన ఉదాహరణ సిలికానాంధ్ర మనబడి. అమెరికా లోని 35 రాష్ట్రాలలో 260కి పైగా కేంద్రాల్లో మనబడి విస్తరించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 10 కి పైగా ఇతర దేశాలలోనూ ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించిది. సంచలనం ఏంటంటే... సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరంలో పది వేల మందికి పైగా విద్యార్థులు ఇందులో నమోదు చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక వాస్క్ (ACS - WASC) ఎక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ (FLC) గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ (అధ్యక్షుడు) రాజు చమర్తి పేర్కొన్నారు. గత పన్నెండేళ్ళలో మనబడి ద్వారా 45 వేల మందికి పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని, ఈ సంవత్సరవం 10 వేల మందికి పైగా విద్యార్ధులు నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. పిల్లలో పాఠాలపై ఆసక్తి పెంపొందించడానికి ఈ సంవత్సరం మనబడి బాలరంజని అనే (IOS & Android) మొబైల్ యాప్ కూడా విడుదల చేసామని అధ్యక్షులు రాజు చమర్తి తెలిపారు.
అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు భాష నేర్పించడం ఒక ప్రత్యేకత అయితే,  తెలుగు మాట్లాట(పోటీలు), బాలానందం(రేడియో కార్యక్రమం), తెలుగుకు పరుగు, పద్యనాటకం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులకు మన కళలు, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించడం మనబడి మరో ప్రత్యేకత.  మనబడి అభివృద్ధి మరియు ప్రాచుర్యం విభాగం ఉపాధ్యక్షుడు శరత్ వేట ఈ వివరాలను నమస్తేఆంధ్రకు వెల్లడించారు. సిలికానాంధ్ర మనబడి 2019-2020 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు సెప్టెంబర్ 20వ తేదీలోగా manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవాలని మరోసారి ఆయన సూచించారు. 

మరిన్ని వివరాలకు 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని శరత్ వేట తెలిపారు. అమెరికాలో దేశవ్యాప్తంగా మనబడి నాయకత్వం, ప్రాంతీయ సమన్వయకర్తలు, మనబడి కేంద్ర  సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, స్వఛ్చంద కార్యకర్తల సహకారంతో నూతన విద్యా సంవత్సర తరగతులు వైభవంగా ప్రారంభమయ్యాయి. మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ మనబడి సంచాలకులు ఫణిమాధవ్ కస్తూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తానికి అమెరికా గడ్డపై తెలుగు వెలిగింది.  

full photo gallery link : https://photos.google.com/share/AF1QipNGHNrvlH0Gv9vel12-4J-zpi5sQX3O57WJBJ-EHkmCgepiTqLiTMlhIzkw0ScEWg?key=S2FOTkc3OWk0QlhDYUZFeXNOZXJuZ1BfTDRvTHVn

Read Also

హీరో నాగార్జున విశ్వరూపం
ప్రగతిభవన్ కుక్కనా... మజాకా?...
హైదరాబాదుకు సత్య నాదెళ్ల