మనబడి 7వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీల విజేతలు వీరే!

January 23, 2020

"పలుకే బంగారం - పదమే సింగారం" నేపథ్యంతో సిలికానాంధ్ర మనబడి ఈ వారాంతం డెట్రాయిట్ లో ఏడో అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. అమెరికా లో 800 మంది కి పైగా విద్యార్థులు ప్రాంతీయ పోటీలలో తలపడగా అందులో నెగ్గిన 52 మంది మెరికలు ఈ తుది పోటీలలో పాల్గొన్నారు. "తిరకాటం" అన్న తెలుగు ప్రశ్నలు జవాబుల క్విజ్ పోటీలో విద్యార్థులు తెలుగు సాహిత్యం, కళలు, జాతీయాలు, సామెతలు , తెలుగు వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు లాంటి అనేక విభాగాల్లో ప్రశ్నలకి అవలీలగా జవాబులు చెప్పి తమ విజ్ఞానాన్ని ప్రదర్శించారు. "పదరంగం" అనే తెలుగు పదాలను విని రాసే పోటీలో “కులిశకర్కశదేహులు”, "ప్రాక్స్రోతస్సు", "తార్క్ష్యము" లాంటి క్లిష్టమైన పదాలను విద్యార్థులు ఏ మాత్రం తడబాటు లేకుండా రాసేసి ప్రేక్షకులని ఆశ్చర్య పరిచారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు పలువురు కార్యకర్తలు సహకరించారు. సిలికానాంధ్ర మనబడిలో 12 సంవత్సరాలలో 52000 మందికి పైగా విద్యార్ధులు తెలుగున నేర్చుకుంటున్నారనీ, 2019-20 మనబడి తరగతులు సెప్టెంబర్ 7 నుంచి అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాల్లో ప్రారంభమవుతాయని నిర్వహకులు వివరించారు. చేరాలనుకునే వారు ఆగస్టు 31లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. manabadi.siliconandhra.org వెబ్‌సైట్‌ లో పూర్తి వివరాలు పొందుపరిచారు. 1-844-626-(BADI) 2234 లో కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని మనబడి ఉపాధ్యక్షులు శ్రీ తోటపల్లి ధనుంజయ్ వెల్లడించారు.
తెలుగు మాట్లాట పోటీలలో పాల్గొనడానికి తెలుగు పిల్లలందరూ అర్హులే. మీ ప్రాంతంలో జరపదల్చుకుంటే maatlaata@manabadi.siliconandhra.org కు ఈమెయిలు చేయవచ్చు. లేకపోతే +1-248-470-7163 వాట్సాప్ నెంబరు ద్వారా కూడా సంప్రదించవచ్చని మిషిగన్ సమన్వయకర్త శ్రీ పలిగారం దుశ్యంత నాయుడు, తెలుగు మాట్లాట సంచాలకులు శ్రీ తొంటా శ్రీనివాస్ తెలిపారు.

సిలికానాంధ్ర మనబడి 7వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీల విజేతలు:

బుడతలు (5-9 ఏళ్ల పిల్లలు):
పదరంగం: 1. పారుపూడి సాన్వి 2. ఆలిబిల్లి అవనీష్
తిరకాటం: 1. బోదనపు వేదశ్రీ 2. మాల్యవంతం అనిక

సిసింద్రీలు (10-14 ఏళ్ల పిల్లలు):
పదరంగం: 1. జవ్వాది ఆయుష్ 2. కొణతాలపల్లి తరుణి
తిరకాటం: 1. దోసిభట్ల రామ్ 2. నెరయనూరి లాస్య 

Read Also

మలేషియాలో భారత హై కమిషనర్ ని కలసిన APNRT అధ్యక్షులు శ్రీ వెంకట్ మేడపాటి
లులు గ్రూప్స్ తో కెసిఆర్ కి లింక్ పై కేంద్రం ఆరా
ఎన్నారై రత్నాకర్ కు పదవిచ్చిన జగన్