మంచు లక్ష్మీ బాధ అర్థం చేసుకోదగ్గదే కానీ..

December 14, 2019

తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోవడంపై తరచుగా నిరసన గళాలు వినిపిస్తుంటాయి. థియేటర్లను నలుగురైదుగురు నిర్మాతలు తమ చేతుల్లో పెట్టుకుని చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తుంటారు. సంక్రాంతి టైంలో వల్లభనేని అశోక్ అనే నిర్మాత ఈ విషయమై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు లక్ష్మీప్రసన్న సైతం ఈ విషయంలో ఆవేదన స్వరం వినిపించడం గమనార్హం. మోహన్ బాబు కూతురని కూడా చూడకుండా తన సినిమాలకు థియేటర్లు కేటాయించడంలో అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తనతో ‘దొంగాట’ అనే సినిమా తీసిన వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి ‘మిస్సెస్‌ సుబ్బలక్ష్మి’ పేరుతో వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తూ, నటిస్తోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పెట్టిన ప్రెస్ మీట్లో మంచు లక్ష్మీ మాట్లాడింది. ప్రస్తుతం సినిమాలు నిర్మించాలంటేనే తనకు భయమేస్తోందని..ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన సినిమాకు థియేటర్లు దొరకకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని ఆమె చెప్పింది. తాను నటించిన చాలా సినిమాల్ని థియేటర్లలో వారమైనా ఉంచకుండా తీసేశారని.. వేరే ఏవో సినిమాలు వస్తున్నాయని.. థియేటర్లలో ఉన్న సినిమాల్ని తీసేయడం అన్యాయమని ఆమె అంది. మోహన్ బాబు కూతురన్నది కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించింది. థియేటర్లు ఐదుగురి చేతుల్లోనే ఉన్నాయని.. వాళ్లు చెప్పినట్లే అంతా నడుస్తోందని ఆమె విమర్శించింది. ఐతే లక్ష్మి ఆవేదన అర్థం చేసుకోదగ్గదే కానీ.. ఆమె నటించిన చాలా సినిమాలకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందనే లేదు. చివరగా ఆమె నుంచి వచ్చిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ విషయానికి వస్తే దీనికి పాజిటివ్ రివ్యూలొచ్చినా.. తొలి రోజు నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. అంతకుముందు ఆమె సినిమాల పరిస్థితి కూడా అంతే. సినిమాలు ఆడనపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? కలెక్షన్లు రానపుడు నష్టాలతో సినిమాల్ని నడిపించలేరు కదా?