మంచులక్ష్మి ఐడియా వెరైటీగా ఉందే

August 07, 2020

తెలుగు సినీ పరిశ్రమలో ఏటా జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా జరుపుకునే వాళ్లలో మంచు మోహన్ బాబు ఒకరు. తాను స్థాపించిన విద్యా నికేతన్ ప్రాంగణంలో వేలాది మంది విద్యార్థుల మధ్య ఆయన అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారు. ఈ వేడుకలకు పెద్ద పెద్ద వాళ్లనే ముఖ్య అతిథులుగా పిలుస్తుంటాడు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతోమంది ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈసారి కూడా మార్చి 19న ఘనంగానే పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనుకున్నారాయన. కానీ కరోనా వైరస్ వచ్చి అడ్డం పడింది. వేడుకలు రద్దయ్యాయి. ఈసారికి కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జన్మదిన వేడుకలు కానిచ్చేశారాయన. ఈ సందర్భంగా మోహన్ బాబుకు ఆయన తనయురాలు లక్ష్మీ ప్రసన్న ఓ అరుదైన కానుక ఇవ్వడం విశేషం.

తన తండ్రి కోసం భారీ సింహాసనాన్ని తయారు చేయించి ఇచ్చింది మంచు లక్ష్మి. ఈ విషయాన్ని జన్మదిన వేడుకలు అయిన మరుసటి రోజు సోషల్ మీడియాలో వెల్లడించింది లక్ష్మి. మోహన్ బాబును కూతురు చేయించిన సింహాసనం మీద కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. తల పైన.. చేతులు పెట్టే చోట్ల సింహం బొమ్మలతో చాలా రాయల్‌గా అనిపిస్తోంది ఈ సింహాసనం. ‘‘మా నాన్నకు కొత్త సింహాసనం. దీనిపై కనిపిస్తున్న మూడు సింహాలు.. మా ముగ్గురికి సంకేతం (లక్ష్మి, విష్ణు, మనోజ్). నేనే దీన్ని చేయించాను’’ అని లక్ష్మి వెల్లడించింది. మోహన్ బాబుకు తన ఇంట్లో ఓ సింహాసనం ఉండగా.. ఇది కొత్తగా వచ్చి చేరింది. కొన్నేళ్లుగా మోహన్ బాబు హైదరాబాద్ శివార్లలో, శంషాబాద్ ప్రాంతంలో పెద్ద ప్యాలెస్ కట్టుకుని అక్కడే ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే.