మంచు విష్ణు వల్ల ప్రాణాపాయమంటున్న దర్శకుడు

May 24, 2020

మంచు విష్ణు సినిమా ‘ఓటర్’ కొన్ని రోజులుగా విచిత్రమైన కారణంతో వార్తల్లో ఉంటోంది. ఎప్పుడో మూడేళ్ల కిందట మొదలైన ఈ చిత్రం ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. ఆ మధ్య దీని టీజర్ రిలీజ్ చేస్తే పట్టించుకున్నవాడు లేడు. ఈ సినిమాను ఎలా రిలీజ్ చేయాలా అని చూడకుండా దర్శకుడు, హీరో గొడవ పడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దర్శకుడు కార్తీక్ రెడ్డి మీద విష్ణు వర్గీయులు.. విష్ణు మీద కార్తీక్ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు నిర్మాణంలో వచ్చిన ‘అసెంబ్లీ రౌడీ’ కథ, స్క్రీన్ ప్లే నుంచి స్ఫూర్తి పొంది ‘ఓటరు’ స్క్రిప్టు రాసినందుకు కోటిన్నర రూపాయలు ఇచ్చేట్లు దర్శకుడు తమతో ఒప్పందం చేసుకున్నట్లుగా విష్ణు వర్గం ఆరోపిస్తోంది. కానీ దర్శకుడి వాదన భిన్నంగా ఉంది. ఈ సినిమాకు స్క్రిప్టు రాసి డైరెక్షన్ కూడా చేస్తున్నందుకు తాను అందుకుంటున్న పారితోషకం కేవలం రూ.20 లక్షలని.. అలాంటపుడు తాను స్క్రిప్టుకు కోటిన్నర ఇచ్చేందుకు ఎలా అంగీకరిస్తానని అతను ప్రశ్నిస్తున్నాడు.
తాజాగా కార్తీక్ ఒక సంచలన వీడియోతో మీడియా ముందుకొచ్చాడు. విష్ణు మీద ఇందులో సంచలన ఆరోపణలు చేశాడు. అతడి వల్ల తనకు ప్రాణహాని ఉందన్న విధంగా అతను మాట్లాడటం గమనార్హం. తనకు సినిమా మొత్తానికి ఇచ్చే పారితోషకమే 20 లక్షలైనపుడు కోటిన్నర పెట్టి `అసెంబ్లీ రౌడీ` రైట్స్ కొని సినిమా తీస్తానా.. బాహుబలి హక్కులకే కోటిన్నర ఉండదు కదా అని కార్తీక్ అన్నాడు. మంచు విష్ణు లాంటి హీరో ఇలా చేయడం తగదని.. కాసుల కక్కుర్తితో అతనిలా చేయడం దారుణమని కార్తీక్ అన్నాడు. తాను ఇలా రివర్సయ్యాను కాబట్టి కాబట్టి అతడు తనను ఏమైనా చేయొచ్చని. తనను ఏం చేసినా .. తాను కనిపించకుండా పోయినా .. ఏం జరిగినా అందుకు మంచు విష్ణునే కారణమని ఇది అందరూ గుర్తుంచుకోవాలని అన్నాడు కార్తీక్. ఒక దర్శకుడిగా నిర్మాతకు నష్టం కలగకూడదని భావించి సినిమా రిలీజవ్వాలని భావించి ఒప్పందం మీద సంతకం చేశానని.. తాను ఇంత త్యాగం చేస్తున్నాను కాబట్టి సినిమాని ఎమోషనల్‌గా భావించి రిలీజ్ చేస్తారని ఫీలయ్యానని.. కానీ తననే మోసం చేసి తన మీదే కేసు పెట్టి నిర్మాతను టార్చర్ పెడుతున్నారని కార్తీక్ ఆరోపించాడు. నిజానికి తాను తీసిన ‘ఓటర్’ సినిమాకు ‘అసెంబ్లీ రౌడీ’కి అసలు సంబంధం లేదని కార్తీక్ స్పష్టం చేశాడు.