మంగళగిరి ఎమ్మెల్యే విన్యాసాలు

June 03, 2020

అమరావతిని రాజధాని చేసినా... అమరావతి ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవడం రాష్ట్ర ప్రజలను విస్మయపరిచింది. అయితే... ఎపుడైతే జగన్ అమరావతి నుంచి రాజధాని తరలించాడో ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతం మాత్రమే కాదు, రెండు జిల్లాలు ప్రజలు రగిలిపోతున్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్యే  తమ అధినేత భజనలో పునీతులు అవుతున్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన అతిసామాన్యులను నిండా ముంచి రాజధానిని తరలించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి... వారి పాలిట ఇపుడు శత్రువులా మారారు. అయితే, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం గొప్పలు చెబుతున్నారు. 

చంద్రబాబుకు అమరావతిలో పేదలు ఉండటం ఇష్టంలేదని ఆరోపించారు ఆళ్ల. జగన్ 54 వేల మందికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా అమరావతి ఇపుడు సర్వజన అమరావతి, బహుజన రాజధాని అయ్యిందని ఆళ్ల చెప్పుకొచ్చారు. ఆళ్ల వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయి. అమరావతికి సేకరించిన 33 వేల ఎకరాల్లో 50 శాతం పైగా భూమి ఎకరా లోపు రైతులదే. వారు కోట్లు పెట్టి భూములు కొన్నవారు కాదు. తాతల కాలం నుంచి వచ్చిన కొంచెం పొలం మీద ఆధారపడి సాగు చేసుకుని బతుకులీడుస్తున్న కష్టజీవులు. వారందరికీ వారి భూమిని తీసుకుని అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస స్థలాలను ఇవ్వడానికి చంద్రబాబు ప్రణాళిక వేశాడు. అంటే అమరావతిలో సగం మంది పేదలకే చోటు దక్కింది. కొత్తగా జగన్ దానిని బహుజన అమరావతి చేయడం ఏంటో ఆళ్లకే తెలియాలి. 

వాస్తవానికి అమరావతి రాజధాని ప్రాంతంలో బలహీన వర్గాల ప్రజలు 75 శాతం మంది ఉన్నారు. అమరావతి రాకతో వారి జీవితాలు సుసంపన్నం అయ్యయి. ఇపుడు అమరావతి రాజధాని కాకుండా పోవడంతో వారి జీవితాలకు మళ్లీ విలువలేకుండా పోయింది. దీనివల్ల అక్కడి లక్షలాది ప్రజలను జగన్ రోడ్డున పడేశారు. అమరావతిని అనాథను చేశాడు. రైతుల భూములు అప్పనంగా తనకు నచ్చిన కార్యకర్తలకు దోచిపెడుతున్నారు. 

ఇక్కడ ఇంకో విషయం చర్చించాలి. అమరావతి ప్రాంతంలో 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో 2 లక్షల ఇళ్లను సర్వాంగ సుందరంగా కట్టించి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఆ ఇళ్లు పూర్తిగా ఉచితం. కానీఇపుడు జగన్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టాలంటే కనీసం 10 లక్షలు కావాలి. మరి పేదలు అక్కడ ఇల్లు ఎలా కట్టుకుంటారు? జగన్ పథక రచన ఇలాగే ఉంటుంది. జగన్ ఒకరికి పెట్టడానికి పదుల మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇది ఎపుడు ఆగుతుందో మరి.