జగన్‌పై ఎవరూ చేయని ఆరోపణ చేసిన మాజీ మంత్రి

July 09, 2020

జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేతల దాడి రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటివరకు ఎక్కువగా కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే విమర్శలు చేస్తున్నారు. అడపాదడపా సోము వీర్రాజు, సునీల్ దేవధర్ వంటివారూ ఫైరవుతున్నారు. ఇప్పుడు మిగతా నాయకులు కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి ప్రారంభించారు. తాజాగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలన దారుణం అనుకుంటే... జగన్ పాలన అంతకంటే ఘోరంగా ఉందన్నారు. అంతేకాదు.. టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయంటూ ఇంతవరకూ ఎవరూ ఛేయని ఆరోపణ చేశారు.
శ్రీకాకుళం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సీఎం చంద్రబాబు అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని (అంటే ఆరోపణలు చేసిన వ్యక్తి ఉన్న కేబినెట్ అన్నమాట) జగన్ ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చిన ఆయన టీడీపీ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. అవినీతి అంశంలో టీడీపీ, వైసీపీ ఒక్కటయ్యాయన్న అనుమానం వుందని వ్యాఖ్యానించారు.  విచిత్రం ఏంటంటే... తమపై ఆరోపణలునిరూపించమని వైసీపీని టీడీపీ అడుగుతోంది.
ఏపీలో ఇసుక కొరతపై ఆయన స్పందిస్తూ, ఉపాధి లేక లక్షలాది భవన కార్మికులు అల్లాడుతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని మాణిక్యాలరావు మండిపడ్డారు. తమ తాడేపల్లిగూడెంలో అయితే ఇసుక బస్తాలను ఇంట్లో పెట్టి తాళం వేసిపోతే, ఆ తాళాన్ని బద్దలు కొట్టి నాలుగు ఇసుక బస్తాలను దొంగిలించుకుపోయారని పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైందని అన్నారు. ఇసుక విలువను కూడా బంగారం విలువకు సమానంగా చేసిన ఘనత కచ్చితంగా సీఎం జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.