ఢిల్లీ లీడర్ కి ఫైన్ పడింది

August 06, 2020

కొందరు విషయంలో చట్టం ఎంత చురుకుగా పని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. చట్టం ఎంత కరకుగా ఉంటుందన్న విషయం తాజాగా వెలుగు చూసిన ఉదంతం చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎంత పోటాపోటీగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరాలని బీజేపీ పట్టుదలతో ఉంటే.. తమ చేతిలో ఉన్న అధికారాన్ని చేజారకుండా అన్ని ప్రయత్నాల్ని చేస్తున్నారు ఆప్ నేతలు.

దీంతో.. ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు వీలుగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పట్ పడ్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆప్ అగ్రనేతల్లో ఒకరైన మనీశ్ సిసోడియా. తాజాగా ఆయన తన నియోజకవర్గంలో బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు.
సాధారణంగా రాజకీయ నేతలు నిర్వహించే బైక్ ర్యాలీలో హెల్మెట్ పెట్టుకోవటం ఉండదు. బైక్ ర్యాలీనే ప్రజల చూపు తమ మీద పడటానికి. అలాంటిది.. హెల్మెట్ పెట్టుకుంటే తాము అనుకున్నది సాధ్యం కాదు. అందుకే.. హెల్మెట్ పెట్టుకోలేదు మనీశ్ సిసోడియా. అంతే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది.
బైక్ ర్యాలీ సందర్భంగా సిసోడియా అండ్ కో హెల్మెట్ పెట్టుకోలేదన్న విషయాన్ని ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అంతే.. రంగంలోకి దిగిన అధికారులు హెల్మెట్ పెట్టుకోని మనీశ్ సిసోడియాకు రూ.వెయ్యి ఫైన్ వేస్తూ చలానా విధించారు. ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్న మిగిలిన వారికి చలానా విధించారా? లేదా? అన్న విషయంపై స్పష్టత రావటం లేదని చెబుతున్నారు.